నత్తనడకన ఉపకార వేతనాలు, ఫీజు  దరఖాస్తుల ప్రక్రియ

31 Jan, 2022 01:21 IST|Sakshi

5 నెలలు అవకాశమిచ్చినా పూర్తిస్థాయిలో నమోదు చేసుకోని విద్యార్థులు 

సర్కారు అంచనా 12.5 లక్షలు.. వచ్చినవి 9.60 లక్షలే 

నేటితో ముగియనున్న గడువు.. మరో నెల పొడిగించే అవకాశం! 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలై 5 నెలలవుతున్నా ఇంకా 76 శాతం మంది విద్యార్థులే వివరాలు నమోదు చేసుకున్నారు. నమోదు ప్రక్రియను సర్కారు ఇప్పటికే రెండుసార్లు పొడిగించినా అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. 31తో గడువు పూర్తి కానుండటంతో ఆలోపు 90 శాతం లక్ష్యం చేరుకునేలా కనిపించట్లేదు. దీంతో గడువును మరోసారి పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. 

సెప్టెంబర్‌లో మొదలు 
రాష్ట్రంలో పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న వారిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 2021–22 విద్యా సంవత్సరంలో 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాయి. ఈ ప్రక్రియను అక్టోబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని సర్కారు గడువు పెట్టింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవడంతో గడువును నవంబర్‌ వరకు పొడిగించింది.

అయినా అనుకున్న లక్ష్యం పూర్తవకపోవడంతో ఈ నెల 31 వరకు పెంచింది. ఇప్పటికీ కూడా 9.60 లక్షల మందే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. సంక్షేమ శాఖల అంచనాల ప్రకారం మరో 3 లక్షల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత గడువులోగా 3 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం లేదు. వాస్తవానికి కాలేజీ యాజమాన్యాలు చొరవ తీసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించడం, వాళ్ల నుంచి వివరాలు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చూడాలి. దీనిపై సంక్షేమ శాఖలు కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినా ప్రక్రియ ఇంకా పూర్తవలేదు. 

పరిశీలనపై తీవ్ర ప్రభావం 
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు గతంలో (కరోనాకు ముందు) నవంబర్‌ చివరి వారం, డిసెంబర్‌ రెండో వారం నాటికి 95 శాతం వచ్చేవి. వీటిని ఫిబ్రవరి రెండో వారం కల్లా సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి అర్హతను ఖరారు చేసేవారు. బడ్జెట్‌ లభ్యతను బట్టి నిధులు విడుదల చేసేవారు. కానీ ఈ సారి దరఖాస్తు ప్రక్రియే ఇంకా కొనసాగుతోంది. లక్ష్యం దూరంలో ఉండటంతో గడువును మరో నెల పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు మరింత ఆలస్యంగా ఉపకార వేతనాలు అందే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు