వేసవిలో ఉపాధి కూలీలకు ‘డ్రై సీజన్‌ అలవెన్స్‌’ 

21 Feb, 2021 08:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ‘డ్రై సీజన్‌ అలవెన్స్‌’చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జూన్‌ 30 వరకు ఉపాధి కూలీలు ఈ అలవెన్స్‌ను పొందనున్నారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్‌/మేలలో 30 శాతం, జూన్‌లో 20 శాతం మేర ఈ అలవెన్స్‌ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ఎండా కాలంలో వేడి పెరగడం వల్ల చేసే పని తగ్గి ఆ మేరకు వారికొచ్చే కూలీ తగ్గే అవకాశాలున్నందున ఈ అలవెన్స్‌ను వర్తింపజేస్తారు. వేసవిలో ప్రధానంగా పైన పేర్కొన్న కాలంలో ఇచ్చే కూలీకి అనుగుణంగా చేయాల్సిన పని శాతాన్ని ఈ అలవెన్స్‌లో పేర్కొన్న మేర తగ్గిస్తారు. శనివారం ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలకు సంబంధించిన ప్రతులను  http:// www. rd. telangana. gov. in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.  

ఉపాధికి రూ.139.59 కోట్ల అదనపు నిధులు.. 
2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద అయిన ఖర్చుల కోసం రూ.139.59 కోట్ల మేర అదనపు నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చింది. ఇదివరకే ఇచ్చిన బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులకు కొనసాగింపుగా అదనపు నిధులకు పాలనపరమైన అనుమతినిస్తూ సందీప్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు