Telangana Wine Shop License: మద్యం షాపుల లైసెన్స్‌ల పొడిగింపు లేనట్టే!

10 Sep, 2021 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌ 31తో ముగియనున్న రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువును మరికొంతకాలం పొడిగించాలని మద్యం షాపుల యజమానులు చేసిన విజ్ఞప్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం విముఖతతో ఉన్నట్లు తెలుస్తోంది.

నవంబర్‌ 1 నుంచి రానున్న రెండేళ్ల కాలానికి కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని తీసుకొచ్చి లాటరీ ద్వారా కొత్తగా లైసెన్స్‌లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా సెప్టెంబర్‌ 30తో ముగియనున్న బార్‌ షాపుల లైసెన్స్‌లకు ఫీజు కట్టించుకుని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. ఎక్సైజ్‌ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ గురువారం నిర్వహించిన సమీక్షలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

కొత్త ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన విధివిధానాలపై ఈ సమీక్షలో చర్చించారు. లాక్‌డౌన్‌ కారణంగా 80 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయామని, మరో మూడు లేదా ఆరు నెలల పాటు లైసెన్స్‌ల గడువు పొడిగించాలని మద్యం షాపుల యజమానులు చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చించగా..దీనిపై విముఖత వ్యక్తమైంది. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి దీనిపై తుదినిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

అలాగే దరఖాస్తులతో పాటు లైసెన్స్‌ ఫీజుల పెంపు విషయాన్ని సైతం సీఎంతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమీక్షలో ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, అదనపు కమిషనర్‌ అజయ్‌ రావు, డిప్యూటీ కమిషనర్‌ హరికిషన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు