గిరిజన రిజర్వేషన్లు ఖరారు.. పెంచిన పది శాతం రిజర్వేషన్లను రోస్టర్‌లో సర్దుబాటు చేసిన ప్రభుత్వం

10 Nov, 2022 01:57 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ప్రతి పది పోస్టుల్లో ఒకటి గిరిజనులకు కేటాయింపు

ఎస్టీ కోటా అంశం తేలడంతో కొత్త నియామకాలకు లైన్‌ క్లియర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో ఆరుశాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గిరిజనుల జనాభా ప్రకారం వారికి సమాన వాటా ఇవ్వాలన్న లక్ష్యంతో ఆరుశాతం రిజర్వేషన్లను పదిశాతానికి పెంచింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయగా... పెంచిన 10 శాతం రిజర్వేషన్లను రోస్టర్‌ జాబితాలో సర్దుబాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో ప్రతి పది అవకాశాల్లో ఒకటి గిరిజనులకు దక్కేలా రోస్టర్‌లో ఎస్టీ రిజర్వేషన్లను పొందుపర్చింది.

కాస్త అటు ఇటుగా మారిన రోస్టర్‌
విద్య, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల ప్రక్రియను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రోస్టర్‌ చార్ట్‌నే ప్రామాణికంగా తీసుకుంటుంది. దీని ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న రోస్టర్‌లో గిరిజనులకు పదిశాతం కోటాను సర్దుబాటు చేయడంతో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ... ఇప్పటికే గిరిజనులకు రిజర్వ్‌ చేసిన అంకెలను రిజర్వులో కాస్త అటు ఇటుగా మార్చి పెరిగిన 4 శాతం అంకెలను సర్దుబాటు చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులకు 4 శాతం అదనంగా అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో రోస్టర్‌లో కొత్తగా 15, 42, 67, 92 స్థానాల్లో గిరిజనులు అవకాశాలను దక్కించుకోనున్నారు. ఇప్పటివరకు ఈ నాలుగు పాయింట్లు జనరల్‌ కేటగిరీకే కేటాయించగా... తాజాగా గిరిజనులకు కేటాయిస్తూ రోస్టర్‌లో మార్పులు జరిగాయి. 

6% రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్‌ పాయింట్లు
ఎస్టీ(మహిళ): 8, 58
ఎస్టీ(జనరల్‌): 25, 33, 75, 83

10శాతం రిజర్వేషన్ల పెంపుతో రోస్టర్‌ పాయింట్లు
ఎస్టీ(మహిళ): 8, 33, 75
ఎస్టీ(జనరల్‌): 15, 25, 42, 58, 67, 83, 92

కొత్త నియామకాలకు మార్గం సుగమం
గిరిజన కోటా అంశం తేలడంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో కొలువుల భర్తీకి అనుమతులు ఇవ్వగా... గిరిజన రిజర్వేషన్ల అంశంతో కాస్త జాప్యం నెలకొంది. ఇప్పుడు రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో కొత్తగా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఇకపై గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలయ్యేలా నియామకాలు చేపట్టాలి. ఈమేరకు నియామక ఏజెన్సీలు సైతం పక్కాగా చర్యలు తీసుకోవాలి. అతి త్వరలో ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీలో వేగిరం పుంజుకోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
చదవండి: కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు