పక్కా నిర్వహణ, నిఘా

3 Oct, 2021 00:50 IST|Sakshi

దళితబంధు యూనిట్ల నిర్వహణకు మార్గదర్శకాల జారీ 

లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు కమిటీల ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేసే యూనిట్ల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రూ.10 లక్షల విలువైన యూనిట్ల ఏర్పాటుతో ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా అమలుచేస్తున్న ఈ కార్యక్రమంపై పక్కా నిర్వహణ, నిఘాను ఏర్పాటు చేస్తోంది.

ప్రతి లబ్ధిదారుకు సరైన అవగాహన కల్పించడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ అవగాహన కల్పిస్తాయి. యూనిట్‌ నిర్వహణలో మెళకువలపై చైతన్యపర్చడం, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు యూనిట్లను విజయవంతంగా ముందు కు తీసుకెళ్లేందుకు తోడ్పాటు అందిస్తాయి. 

ఇవీ మార్గదర్శకాలు... 
దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారుకు ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకులో ప్రత్యేక ఖాతాను తెరుస్తారు. పాసు పుస్తకం, చెక్‌ పుస్తకం ఇస్తారు. 
ఒక్కో ఖాతాలో రూ.10 లక్షలు జమచేస్తారు. దళిత రక్షణ నిధి కింద ఈ ఖాతా నుంచి రూ.10 వేలు వెనక్కి తీసుకుంటారు.  
వ్యవసాయ అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ పరిశ్రమ, రిటైల్‌ దుకాణాలు, సేవలు–సరఫరా కేటగిరీల్లో యూనిట్లను ఎంచుకోవచ్చు. 
నిర్దేశించిన రంగాల్లో సీనియర్‌ అధికారులతో పాటు నిపుణులను గుర్తించి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో రిసోర్స్‌ పర్సన్లను, కమిటీలను ఎంపిక చేస్తారు. 
అవసరమైతే ఇతర జిల్లాల నుంచి కూడా రిసోర్స్‌ పర్సన్లను లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. 
యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత నిధుల విడుదలకు కమిటీ అనుమతి ఇస్తుంది. అనంతరం కలెక్టర్‌ ఆమోదంతో ఆ మేరకు చెక్కును బ్యాంకు మేనేజర్‌ ఆమోదిస్తారు. 
లబ్ధిదారులు ఏర్పాటు చేస్తున్న యూనిట్లకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును రిసోర్స్‌ పర్సన్లు తయారు చేయాలి. 
యూనిట్‌ ఏర్పాటుపై లబ్ధిదారుకు శిక్షణ, అవగాహనతో పాటు చైతన్యపర్చేందుకు కమిటీలు పనిచేస్తాయి. 
యూనిట్‌ ఏర్పాటుకు నిర్దేశించిన సాయం సరిపోకుంటే ఇద్దరు సంయుక్తంగా యూనిట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ.10 లక్షల విలువ చేసే రెండు యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.  
రిసోర్స్‌ పర్సన్లు, కమిటీలు దళితవాడలు, గ్రామాలు, ఆవాసాలను నిరంతరం సందర్శించి పరిస్థితిని సమీక్షించాలి. లబ్ధిదారుల ప్రాధాన్యతలను గుర్తించి వివరించాలి. 
లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారితో సమగ్ర శిక్షణ మాడ్యూళ్లను స్థానిక పరిస్థితులకు తగినట్లుగా రూపొందించాలి. 
ఈ మాడ్యూళ్ల తయారీలో నిపుణులు, ప్రభుత్వేతర సంస్థలు, ఎన్జీఓల సహకారం తీసుకోవచ్చు. 
లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా శిక్షణ తరగతులను నిర్వహించాలి. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలి. 2 నుంచి 6 వారాల్లో ఈ శిక్షణలు పూర్తిచేయాలి. 
ఇప్పటికే ఆయా రంగాల్లో విజయవంతంగా యూనిట్లు నిర్వహిస్తున్న వారి సహకారాన్ని తీసుకోవాలి. 
లబ్ధిదారు ప్రారంభించతలచిన యూనిట్లను ప్రతి దశలో విజయవంతంగా పూర్తిచేసేందుకు కమిటీలు, రిసోర్స్‌ పర్సన్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.  

మరిన్ని వార్తలు