అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ సమ్మతి 

1 Feb, 2023 02:23 IST|Sakshi

గత నెల 21 నాటి నోటిఫికేషన్‌ స్థానంలో మరో నోటిఫికేషన్‌

3న మధ్యాహ్నం 12.10 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం

ప్రస్తుత సమావేశాల్లో మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈ నెల 3న మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభల సమావేశాలకు సంబంధించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పక్షాన అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచార్యులు సోమవారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 3న ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

మరుసటి రోజు 4న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 6న ఉభయసభల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ నెల 14వరకు సమావేశాలు జరిగే అవకాశముండగా, 3న జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది. ఫిబ్రవరి 3 నుంచే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని గత నెల 21న అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

అయితే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు సాక్షిగా సోమవారం రాజీ కుదిరిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176 (1) ప్రకారం ఏటా తొలిసారిగా జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగించాలనే నిబంధన ఉండటంతో గత నెల 21న జారీ చేసిన నోటిఫికేషన్‌ స్థానంలో మరో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే గత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్‌ చేసిన తర్వాతే తాజా నోటిఫికేషన్‌ జారీ చేశారా అనే అంశంపై స్పష్టత లోపించింది. 

మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక? 
ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ కూడా వెలువడే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌తోపాటు ప్రభుత్వ చీఫ్‌ విప్, మరో రెండు విప్‌ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుత సమావేశాల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. మరోవైపు గత రెండు సమావేశాల్లో బీజేపీ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయగా, ప్రస్తుత సమావేశాల్లో వారికి అవకాశం దక్కుతుందా లేదా అనే కోణంలో చర్చ జరుగుతోంది. కాగా మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సభలోకి అడుగుపెట్టనున్నారు. 

గవర్నర్‌ ప్రసంగంపై ఉత్కంఠ 
ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనుండటంతో ఆమె ప్రసంగ పాఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తొమ్మిదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన విజయాలకు అద్దం పట్టేలా రూపొందిస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు