Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు! ఎంపిక ప్రక్రియలో మార్పులు?

29 Nov, 2022 14:52 IST|Sakshi

ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేస్తే బాగుంటుందనే యోచన

నియోజకవర్గంలోని గ్రామాలన్నీ కవర్‌ అయ్యేలా ఎంపిక ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధు పథకం లబ్ధిదా­రు­ల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియో­జకవర్గస్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు చేసిన జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని, మిగతా వారికి ప్రాధాన్యం దక్కడం లేదని క్షేత్రస్థాయిలో ఆరోపణ­లున్నాయి.

ఆర్థిక అసమానతలను తొలగించే క్రమంలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రభుత్వ స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని దళిత కుటుంబాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిం­చారు. దీంతో హైకోర్టు ఎమ్మెల్యే సిఫార్సుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో మార్పులపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.

ప్రత్యేక కమిటీ ద్వారా ఎంపిక చేస్తే...
లబ్ధిదారులను ఎమ్మెల్యే సూచించిన జాబితా ఆధారంగా కాకుండా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ సూచనలతోపాటు, ఎమ్మెల్యేల సూచనలు సైతం కోరింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్థానం పరిధిలో జిల్లా అధికారి లేదా ఆర్డీఓ, సమానస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు సూచించారు.

ఈ కమిటీలో ఎమ్మెల్యేను సైతం భాగస్వామ్యం చేయాలని శాసనసభ్యులు సైతం కోరినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని గ్రామాలన్నీ కవర్‌ అయ్యేలా ఎంపిక ప్రక్రియ ఉండాలనే సూచనలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దళితబంధు కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఆమోదించినప్పటికీ కోర్టు సూచనలతో నిలిచిపోయింది.  

మరిన్ని వార్తలు