Telangana High Court: సహజ న్యాయసూత్రాలను కాలరాస్తారా?

5 May, 2021 09:22 IST|Sakshi

విచారణ పేరుతో ఎవరింట్లోకైనా వెళ్లిపోతారా? 

ఆగమేఘాలపై విచారణ జరపాల్సిన అవసరం ఏంటి?

జమున హ్యాచరీస్‌ కేసులో మెదక్‌ కలెక్టర్‌పై హైకోర్టు ఫైర్‌ 

ముందే సిద్ధమై నివేదిక రూపొందించినట్టు ఉంది 

ఆ రిపోర్టును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవద్దు 

నోటీసు జారీచేసి, వివరణకు తగిన సమయం ఇవ్వండి 

తప్పులున్నట్టు తేలితే చర్యలు తీసుకోవాలని ఆదేశం.. జూలై 6కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్‌లో అసైన్డ్‌ భూముల పేరుతో మెదక్‌ కలెక్టర్‌ హడావుడిగా చేసిన విచారణను హైకోర్టు తప్పుబట్టింది. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఆగమేఘాలపై విచారణ చేపట్టడం ఏమిటని నిలదీసింది. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించిన ఆర్టికల్‌ 14, 19, 21ని ఉల్లంఘించే అధికారం కలెక్టర్‌కు ఉందా? అని ప్రశ్నించింది. ఈ నెల 1న కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోరాదని, దానితో ప్రభావితం కావొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

జమున హ్యాచరీస్‌ యాజమాన్యానికి తాజాగా నోటీసులు జారీచేయాలని, వివరణ ఇచ్చేందుకు నిర్దిష్టమైన సమయం ఇవ్వాలని.. ఆ తర్వాత తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని తేల్చిచెప్పింది. అప్పటివరకు బలవంతంగా ఎటువంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులి చ్చారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మెదక్‌ కలెక్టర్‌ తమ కంపెనీలో విచారణ చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ.. జమున హ్యాచరీస్‌ తరఫున ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి హౌస్‌ మోషన్‌ రూపంలో అత్యవసరంగా విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. 

కనీస నిబంధనలు పాటించరా? 
ఏప్రిల్‌ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించడం, వెంటనే విచారణ జరిపి తర్వాతి రోజే నివేదిక సమర్పించడం జరిగిపోయిందని.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏ నిబంధన ప్రకారం జమునా హ్యాచరీస్‌ భూముల్లోకి కలెక్టర్‌ ప్రవేశించారని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేశారు. కలెక్టర్‌ చేపట్టింది ప్రాథమిక విచారణ మాత్రమేనని, రెవెన్యూ అధికారి విచారణ కోసం ఎవరి భూమిలోకి అయినా వెళ్లొచ్చని ఏజీ వివరణ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘ప్రాథమిక హక్కులను, చట్ట నిబంధనలను కలెక్టర్‌ ఉల్లంఘిస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? విచారణ చేసి ఎన్ని గంటల్లో నివేదిక ఇచ్చారు? ప్రతివాదిగా ఉన్న వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఎలా విచారణ చేస్తారు? ఈ విషయంలో కనీస ప్రొటోకాల్‌ పాటించలేదు. సెక్షన్‌ 149, 151 ప్రకారం.. సదరు కంపెనీ యజమానికి సమాచారం ఇవ్వాలి. వారి సమక్షంలోనే విచారణ చేయాలి. కలెక్టర్‌ నోటీసులు జారీచేసి ఉంటే ఈ అపవాదు వచ్చేదికాదుగా. సచివాలయంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే ఎటువంటి ప్రొటోకాల్‌ పాటించాలో.. అలాగే విచారణ జరిపే సమయంలోనూ నిబంధనల మేరకు వ్యవహరించాలి. బ్యాక్‌ డోర్‌ నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లాలి. అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లుగా ఉంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

మొక్కుబడి నోటీసులు వద్దు 
సేల్స్‌ ట్యాక్స్‌ అధికారుల తరహాలో మొక్కుబడిగా నోటీసులు జారీచేసి చర్య తీసుకుంటామంటే కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సేల్స్‌ ట్యాక్స్‌ అధికారులు మూడు వేర్వేరు తేదీల్లో నోటీసులు జారీ చేసినట్లు చూపించి, తర్వాత చర్య తీసుకున్నామని చెప్తుంటారు. నోటీసులు ఎవరికి ఇచ్చారనేది చెప్పరు. ఈ కేసులో అలా వ్యవహరించడానికి వీల్లేదు. శుక్రవారం నోటీసులిచ్చి సోమవారానికల్లా వివరణ ఇవ్వాలంటే కుదరదు. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. వివరణ తీసుకున్న, విచారణ జరిపి తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెదక్‌ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌తోపాటు డీజీపీ, ఏసీబీ, విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్, మెదక్‌ ఎస్పీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను జూలై 6కు వాయిదా వేశారు. 
 
ఎవరి వాదన ఏంటి? 
అవి అసైన్డ్‌ భూములే.. కలెక్టర్‌ వెళ్లొచ్చు: ఏజీ 
‘‘జమున హ్యాచరీస్‌లో అసైన్డ్‌ భూములు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే విచారణ జరిపాం. ఆ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ చట్టం సెక్షన్‌ 156 ప్రకారం వాస్తవాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారికి ఎవరి భూమిలోకైనా ప్రవేశించే అధికారం ఉంటుంది. విచారణ సమయంలో హేచరీస్‌ జనరల్‌ మేనేజర్‌ అక్కడే ఉన్నారు. అయినా ముందు జాగ్రత్తగా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు. కలెక్టర్‌ చేసినది ప్రాథమిక విచారణ మాత్రమే.. చర్యలు చట్టబద్ధంగానే ఉంటాయి. ప్రాథమిక విచారణ చట్టబద్ధమేనని పేర్కొంటూ పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తాం’’ అని హైకోర్టులో అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదన వినిపించారు. కానీ దీనిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. నోటీసు జారీచేయకుండా విచారణ చేయవచ్చనేందుకు ఏజీ ఎటువంటి నిబంధనలను చూపించలేకపోయారని స్పష్టం చేశారు. 

అప్పటికప్పుడే ప్రభుత్వ భూములంటూ బోర్డు: పిటిషనర్‌ 
‘‘అడ్వొకేట్‌ జనరల్‌ ఇది ప్రాథమిక విచారణ మాత్రమే అని చెప్తున్నారు. ఏకపక్షంగా విచారణ చేసి.. అప్పటికప్పుడే కేవలం హ్యాచరీస్‌ ఎదుట ఇవి ప్రభుత్వ భూములంటూ బోర్డు పెట్టారు. హ్యాచరీస్‌ కంపెనీ రైతులకు చెందిన 60 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేసింది. ఈ భూముల వివరాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కూడా ఉన్నాయి. కలెక్టర్‌ సర్వే చేసే ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు, రెవెన్యూ అధికారులు హ్యాచరీస్‌ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించారు. ఇలా చట్టవిరుద్ధంగా వ్యవహరించడం ఆర్టికల్‌ 300 (ఎ) ప్రకారం రాజ్యాంగబద్ధ హక్కులను హరించడమే. విచారణ పేరుతో కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను కూడా మాకు అందజేయలేదు. ప్రస్తుతం హ్యాచరీలో 1.60 లక్షల కోళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ నివేదికను చట్టవిరుద్ధంగా ప్రకటించండి. బలవంతపు చర్యలు తీసుకోకుండా, చట్టబద్ధంగా వ్యవహరించేలా ఆదేశించండి’’ అని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు.   


చదవండి: హైకోర్టును ఆశ్రయించిన జమున హ్యాచరీస్‌

ఇవన్నీ పనికి రావు.. సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు