ఉండవల్లి-మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే

2 Sep, 2022 03:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై మార్గదర్శి చిట్‌ఫండ్‌ దాఖలు చేసిన కేసులో కిందికోర్టు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్‌ పి.శ్రీసుధ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తమ సంస్థలకు పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కిందికోర్టులో పరువు నష్టం దావా వేసింది.

అయితే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ జరపలేమని ఉండవల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ కోర్టులో వాదనలు వినిపించారు. రాసిన రిపోర్టర్‌ వచ్చి తానే ఆ కథనాన్ని రాశానని.. దాన్ని అలాగే ప్రచురించారని చెప్పాల్సి ఉంటుందని వెల్లడించారు. అయినా, కిందికోర్టు విచారణకు స్వీకరించడాన్ని సవాల్‌ చేస్తూ.. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ పి.శ్రీసుధ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పత్రికల్లో వచ్చిన కథనాలను ఎవిడెన్స్‌ యాక్ట్‌ ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని చెప్పారు.

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే కేసు ఆమోద యోగ్యతను నిర్ణయించాలని గతంలో హైకోర్టు.. కిందికోర్టుకు సూచించిందని వెల్లడించారు. అయినా, ఈ దశలో ఆమోద యోగ్యతను నిర్ణయించాల్సిన అవసరం లేదని లోయర్‌కోర్టు పేర్కొందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కిందికోర్టు విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.    

మరిన్ని వార్తలు