ధాన్యం తూకం వేయరా

26 Nov, 2021 02:26 IST|Sakshi
ఇందుర్తిలో ధాన్యం తూకం వేయడం లేదని ట్యాంకు ఎక్కిన రైతులు  

అన్నదాతల ఆగ్రహం

పురుగు మందు డబ్బాతో వెళ్లిన రైతు సంఘం నేతలు 

ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరిక 

అధికారుల చర్చలతో శాంతించిన రైతులు 

చిగురుమామిడి: ధాన్యం తూకం వేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కొందరు రైతులు పురుగు మందు డబ్బాతో మంచినీటి ట్యాంకు ఎక్కి నిరసనకు దిగారు. గురువారం ఉదయం కొనుగోలు కేంద్రంలో కాటాలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన మరికొందరు రైతులు సెంటర్‌లోనే ధర్నాకు దిగారు. ఓ వైపు ట్యాంకు ఎక్కిన రైతులు, మరోవైపు కింద రైతుల ధర్నాతో ఏం చేయాలో పాలుపోక కేంద్రం నిర్వాహకులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

అధికారుల రాక ఆలస్యం కావడంతో రైతులు ఆగ్రహించారు. తమ ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేయడం లేదని, రైసు మిల్లు యజమానులు నూక పేరుతో బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు కట్‌ చేస్తున్నారని ఆరోపించారు. నూకలవుతున్నాయనే సాకుతో 43 నుంచి 44 కిలోలు తూకం వేస్తూ రైతులను ముంచుతున్నారని వాపోయారు. రైతు సంఘం మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బందెల శ్రీనివాస్, గట్టు జనార్దన్, మురళి, అందె రాయమల్లు, కుట్ల శ్రీనివాస్, గుమ్మడి బాలయ్య, మరో ఇద్దరు రైతులు ట్యాంకు పైనే ఉండగా.. అధికారులు స్పందించకుంటే పురు గు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని పలుమార్లు హెచ్చరించారు.

సమాచారం అందుకున్న చిగురుమామిడి తహసీల్దార్‌ ముబీన్‌అహ్మద్, నయాబ్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్, చిగురుమామిడి ఎస్‌ఐ దాస సుధాకర్, ఐకేపీ సీసీ వెంకటేశ్వర్లు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. ఎలాంటి కొర్రీలు లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ట్యాంకు ఎక్కిన రైతులు కిందకు దిగారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అందె స్వామి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు