దావోస్‌కు కేటీఆర్‌ బృందం

15 Jan, 2023 00:46 IST|Sakshi

ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాలకు ఐదోసారి  

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేతృత్వంలో అధికారుల బృందం శనివారం రాత్రి బయలుదేరి వెళ్లింది. నేడు జూరిచ్‌కు చేరుకోనున్న కేటీఆర్‌ బృందం రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటుంది. 2018లో తొలిసారిగా తెలంగాణ నుంచి దావోస్‌కు ప్రతినిధులు వెళ్లగా 2019, 2020, 2022లోనూ హాజరయ్యారు.

దావోస్‌ సమావే­శాలకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్లడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ప్రతీ ఏటా జనవరిలో వరల్డ్‌ ఎకనామిక్‌ సమావేశాలు జరగ­నుం­డగా కోవిడ్‌ పరిస్థితుల్లో గత ఏడాది మేలో జరిగాయి. ‘కో ఆపరేషన్‌ ఇన్‌ ఫ్రాగ్మెంటెడ్‌ వరల్డ్‌’ నినాదంతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఆల్‌పైన్‌ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉన్న విడిది పట్టణం దావోస్‌ ఆతిథ్యమిస్తోంది.

కాగా దావోస్‌లో ఏర్పాటయ్యే తెలంగాణ పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు చెందిన అధినేతలతో భేటీకా­వడంతో పాటు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో భాగంగా జరిగే రౌండ్‌ టేబుల్‌ భేటీల్లో కేటీఆర్‌ పాల్గొంటారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కేటీఆర్‌ ప్రసంగాలు, భేటీలు ఉంటాయి.  

మరిన్ని వార్తలు