తాటాకు చప్పుళ్లకు బెదరం

23 Nov, 2022 02:14 IST|Sakshi

మంత్రి తలసాని 

ఈ నెల 27న హైదరాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యవస్థల ద్వారా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన పార్టీ హైదరాబాద్‌ జిల్లా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకుని చేసే తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ‘ఈ రోజు వ్యవస్థలు మీ చేతుల్లో ఉండొచ్చు. రేపు మా చేతుల్లో ఉండొచ్చు’అని తలసాని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ మంత్రు లు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చేస్తున్న దాడు లు, ఇతర పరిణామాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామన్నారు.  

27న టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశం 
తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశం ఈ నెల 27న నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు