విద్యుత్‌ ఉద్యోగులకు టీకాలు   

3 Jun, 2021 03:23 IST|Sakshi

ఓఅండ్‌ఎం ఉద్యోగులు, ఆర్టిజన్లకు త్వరితంగా వేయాలి 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం 

ట్రాన్స్‌కో సీఎండీ విజ్ఞప్తికి సానుకూల స్పందన 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 మహమ్మారి కాలంలో సైతం నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) విభాగాల ఉద్యోగులు, ఆర్టిజన్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి త్వరితంగా వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నిర్దేశించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి విద్యుత్‌ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో 30 వేల మంది ఉద్యోగులు, 22 వేల మంది ఆర్టిజన్లు కలిపి మొత్తం 52 వేల మంది ఉన్నారు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగులైన మీటర్‌ రీడర్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 55 వేలు అవుతుంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఓఅండ్‌ఎం ఉద్యోగులు, ఆర్టిజన్లు కలిపి 40 వేల మందికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నారు. మిగిలిన విద్యుత్‌ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌కు విద్యుత్‌ సంస్థలే ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ఇతర విభాగాల విద్యుత్‌ ఉద్యోగుల టీకా ఖర్చులను విద్యుత్‌ సంస్థలే భరించనున్నాయి.  

ఐదారు రోజుల్లో వ్యాక్సినేషన్‌: ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు 
కరోనా బారినపడిన విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లకు ఎంత ఖర్చయినా భరించి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ఐదారు రోజుల్లో విద్యుత్‌ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ను ప్రారంభించే అవకాశముందని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు