ఈసారి ఆపరేషన్లు లేనట్టే!

3 Dec, 2022 02:57 IST|Sakshi

కళ్లద్దాలు ఇవ్వడానికే పరిమితం కానున్న ‘కంటి వెలుగు–2’ 

మొదటి విడతలో కొందరికి ఆపరేషన్లు వికటించడమే కారణం

సాక్షి, హైదరాబాద్‌: కంటి వెలుగు రెండో విడతలో ఆపరేషన్లు ఉండవని తెలుస్తోంది. మొదటి విడత లో కొందరికి ఆపరేషన్లు చేయించగా అవి వికటించడంతో వాటిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారవర్గాల సమాచారం. ఇదిలా ఉండగా కంటి వెలుగు రెండో విడతలో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తే, దాదాపు 10 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం అవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.

చాలామందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్రంలో కంటి వెలుగు–2 కార్యక్రమం ప్రారంభం కానున్న విష యం తెలిసిందే. పని దినాల ప్రకారం వంద రోజు ల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 55 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రీడింగ్‌ గ్లాసులు, చత్వారం అద్దాలను అందజేస్తారు. బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన కళ్లద్దాలనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 

మొదటి విడతలో 1.54 కోట్ల మందికి పరీక్షలు
2018లో ప్రారంభమైన కంటి వెలుగు మొదటి విడత దాదాపు 8 నెలలపాటు జరిగింది. అప్పుడు 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే ఉండటం గమనార్హం. అప్పట్లో ఎన్నికలకు ముందు సర్కారుకు ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది. కంటి ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం దాదాపు 9.30 లక్షల మందిని గుర్తించారు.

కాగా, ఇందులో కొందరికి ఆపరేషన్లు చేయించారు. ఒకట్రెండు చోట్ల ఆపరేషన్లు వికటించడంతో ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. ఇదిలా ఉండగా రెండో విడత కంటి వెలుగులో ఆపరేషన్లపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. కేవలం కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. ఆపరేషన్లు ఎక్కడైనా వికటిస్తే అది మొత్తం కార్యక్రమానికే చెడ్డపేరు తెస్తుందని అంటున్నారు. కాగా, ప్రైవేట్‌ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఆపరేషన్లు చేయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు