పెండింగ్‌ కేసుల పరిష్కారంలో దూకుడు

20 Jan, 2021 20:47 IST|Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో నెమ్మదించిన ప్రక్రియ

డీజీపీ ప్రత్యేక శ్రద్ధతో మళ్లీ పుంజుకున్న వేగం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌ కేసుల పరిష్కారం మళ్లీ వేగం పుంజుకోనుంది. వివిధ కారణాలతో దశాబ్దాలుగా నిలిచిపోయిన పాత కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు డీజీపీ డాక్టర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి ఆదేశాలతో అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌పై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీస్‌ శాఖను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 2019 ఆగస్టు నుంచి పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో రంగంలోకి దిగారు. గతేడాది మార్చి వరకు పెండింగ్‌ కేసుల పరిష్కారం బాగానే సాగినా.. ఆ తర్వాత కరోనా కారణంగా నెమ్మదించాయి. గతేడాది జనవరి ఆఖరిలోగా పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌పై నివేదిక ఇవ్వాల్సి ఉన్నా లాక్‌డౌన్‌తో బ్రేక్‌ పడింది. ఇపుడు మళ్ళీ క్రమంగా పాత పరిస్థితులు నెలకొనడంతో తిరిగి కేసుల పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు.(చదవండి: 'ఆయన మృతికి వ్యాక్సిన్‌ కారణం కాదు')

నేరస్తుల అప్పగింతతో..  
నేరం ఆలస్యంగా వెలుగు చూడటం, నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోవడం, బెయిల్‌ అనంతరం అదృశ్యమవడం తదితర కారణాల వల్ల కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఇలా రకరకాల కారణాలతో 1990 నుంచి 2018 వరకు రాష్ట్రంలో మొత్తం 17వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో చాలామటుకు కేసుల్ని పోలీసులు క్లియర్‌ చేశారు. ఏడాదిన్నర కింద జరిగిన దక్షిణ భారత(సదరన్‌) డీజీల సదస్సులో రాష్ట్రాల మధ్య నేరస్థుల అప్పగింత ప్రస్తావన వచ్చింది. ఒక రాష్ట్రంలో నేరానికి పాల్పడి మరో రాష్ట్రంలో ఊరు, పేరు మార్చుకున్న వారిని అప్పగించేందుకు అందరూ సుముఖం వ్యక్తం చేశారు. ఇది కూడా నిందితులను వెంటనే స్వరాష్ట్రానికి తరలించి, కేసును పరిష్కరించడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో 20 ఏళ్లనాటి పెండింగ్‌ వారెంట్లలోనూ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతమవుతున్నారు. 

నాలుగేళ్లుగా కరీంనగర్‌ టాప్‌! 
పెండింగ్‌ కేసుల పరిష్కారంలో కరీంనగర్‌ కమిషనరేట్‌ మంచి ఫలితాలు సాధిస్తోంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంటూ మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇదే విషయమై తాజాగా సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. ఇక కేసుల పరిష్కారంలో రెండో స్థానంలో మహబూబ్‌నగర్‌ ఉండగా తర్వాత వరుసగా నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, రామగుండం కమిషనరేట్లు నిలిచాయి.

మరిన్ని వార్తలు