11 ఇంటర్‌ చేంజర్లు.. 85 వంతెనలు

10 Jan, 2023 03:32 IST|Sakshi

రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తరభాగం ప్రణాళిక సిద్ధం

వీటి నిర్మాణానికి దాదాపు రూ.2 వేల కోట్ల వ్యయం

158.64 కి.మీ. నిడివి రోడ్డు నిర్మాణానికి రూ.8,600 కోట్లు

భూపరిహారానికి రూ.5,200 కోట్లు

డ్రాఫ్ట్‌ డీపీఆర్‌లో పేర్కొన్న యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు(ట్రిపుల్‌ ఆర్‌) ఉత్తర భాగం.. దీని నిడివి 158.645 కి.మీ... ప్రస్తుతానికి నాలుగు వరసల రోడ్డు.. ఈ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులను 11 చోట్ల అడ్డంగా దాటాల్సి ఉన్నందున భారీ ఇంటర్‌చేంజర్‌ స్ట్రక్చర్లను నిర్మించనున్నారు. ఒక్కోటి దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. వీటికితోడు 105 అండర్‌ పాస్‌లు.. 85 వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. 

ప్రతి మూడు కి.మీ.కు రెండు అండర్‌పాస్‌లు
పెద్ద రహదారులను దాటేటప్పుడు ట్రంపెట్, డబుల్‌ ట్రంపెట్, క్లెవర్‌ లీఫ్‌ నమూనాల్లో ఇంటర్‌చేంజర్‌ వంతెనలను నిర్మించనున్న విషయం తెలిసిందే. కానీ, రోడ్లతో సంబంధం లేకుండా ప్రతి కిలోమీటరున్నర నడివికి ఓ అండర్‌పాస్‌ చొప్పున నిర్మాణానికి ప్లాన్‌చేశారు. స్థానికంగా ఉండే ఊళ్ల నుంచి వాహనాలు రోడ్డును అటూఇటూ దాటాలంటే కచ్చితంగా అండర్‌పాస్‌లు అవసరం. అందుకోసం ప్రతి కిలోమీటరున్నరకు ఒకటి చొప్పున ఉండేలా డిజైన్‌ సిద్ధం చేశారు.

అలా ఉత్తర భాగం నిడివిలో 105 అండర్‌పాస్‌లకు ప్లాన్‌ చేశారు. ఇది చిన్నాచితక అండర్‌పాస్‌లు కాదు. భారీ వాహనాలు సులభంగా దూసుకెళ్లేలా 5.5 మీటర్ల ఎత్తుతో ఉంటాయి. భవిష్యత్తులో ఈ రోడ్లను వెడల్పు చేయాల్సి వస్తే, అండర్‌పాస్‌లను వెడల్పు చేయటం సాధ్యంకాదు. అందుకే ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 20 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు.

ఇక వాగులువంకలు, సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించే కెనాల్స్, చెక్‌డ్యామ్‌లు, గుట్టల నుంచి జాలువారే ప్రాంతాల్లో ప్రత్యేకంగా వంతెనలు నిర్మిస్తారు. నీటిప్రవాహానికి రింగురోడ్డు ఏమాత్రం అడ్డంకి కావద్దని ఈ ఏర్పాటు చేశారు. ఉత్తర రింగు నిడివిలో దాదాపు 85 వరకు ఇలాంటి వంతెనలు నిర్మించనున్నారు. నీళ్లు వెళ్లటానికే పరిమితం కాకుండా పక్కనుంచి ట్రాక్టర్లు లాంటి వాహనాల రాకపోకలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇలా ఇంటర్‌ ఛేంజర్లు, అండర్‌పాస్‌లు, నీళ్లు పారేందుకు నిర్మించే వంతెనల కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. 

డ్రాఫ్ట్‌ డీపీఆర్‌ సిద్ధం
రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి రూ.13,800 కోట్లు ఖర్చవుతుందని డ్రాఫ్ట్‌ డీపీఆర్‌లో అధికారులు పేర్కొన్నారు. ఈ రోడ్డును ప్రతిపాదించిన సమయంలో రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, ఇప్పుడు ఆ ఖర్చు భారీగా పెరగనుందని స్పష్టమవుతోంది. రోడ్డు నిర్మాణానికి రూ.8,600 కోట్లు, భూపరిహారా నికి రూ.5,200 కోట్లు అవసరమవుతాయని డ్రాఫ్ట్‌ డీపీఆర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. రోడ్డు నిర్మాణ వ్యయంలో స్ట్రక్చర్లు, వంతెనలు, అండర్‌పాస్‌లకు రూ.2 వేల కోట్ల ఖర్చవుతుందని పేర్కొన్నట్టు సమాచారం. భూసేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చెరో రూ.2,600 కోట్లు చొప్పున భరించాల్సి ఉంటుంది. 

రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమ చేయాల్సిందిగా ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన అంశం తెలిసిందే. రింగురోడ్డు దక్షిణ భాగానికి సంబంధించి అలైన్‌ మెంటును ఖరారు చేసి ఢిల్లీకి ఆమోదం కోసం పంపారు. 189.2 కి.మీ. నిడివితో ఈ అలైన్‌ మెంటును రూపొందించారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపాల్సి ఉంది. ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.   

మరిన్ని వార్తలు