Telangana : ‘హంద్రీనీవా’ నీటి మళ్లింపును అడ్డుకోండి

29 Aug, 2021 03:04 IST|Sakshi

కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ 

ఏపీ చర్యతో తమ ప్రాజెక్టులు నష్టపోతాయని అభ్యంతరం 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటి మళ్లింపును తక్షణం నిలుపుదల చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చే వరకు ఏపీ ఎలాంటి నిర్మాణ పనులు జరపకుండా అడ్డుకోవాలని విన్నవించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్‌ తీర్పులు, వాటిని ఉల్లంఘిస్తూ ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు, ముఖ్యంగా హంద్రీనీవా ద్వారా జరుగుతున్న అక్రమ వినియోగం, పలు సందర్భాల్లో ఏపీ జారీ చేసిన ఉత్తర్వులను లేఖతో జతపరిచారు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం మాత్రమేనని, దాని నుంచి కృష్ణా బేసిన్‌ ఆవలకు నీటి మళ్లింపును ట్రిబ్యునల్‌ అనుమతించలేదని పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి బేసిన్‌ ఆవలకు నీటి తరలింపు వల్ల బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని వివరించారు. నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని.. బేసిన్‌ ఆవల 700 కి.మీ. దూరానికి నీటి తరలింపు అన్యాయమన్నారు. తుంగభద్ర హై లెవెల్‌ కెనాల్‌ సహా ఇతర ప్రాజెక్టులు నీటిని బేసిన్‌ ఆవలికు మళ్లిస్తాయి కాబట్టే వాటికి నీటి కేటాయింపులు చేయట్లేదని బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ పేర్కొందని గుర్తుచేశారు. ప్రస్తుతం హంద్రీనీవా ద్వారా తుంగభద్ర హై లెవల్‌ కెనాల్‌ ఆవలకు నీటిని తీసుకెళ్లడం ట్రిబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకమన్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్‌లకు తరలించడం తప్పని అంటుంటే, ప్రస్తుతం కొత్తగా హంద్రీనీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమమని, దీన్ని అడ్డుకోవాలని కోరారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు