ఉత్సాహంగా మూడోరోజు ‘పట్టణ ప్రగతి’ 

6 Jun, 2022 01:13 IST|Sakshi

అక్కడికక్కడే ప్రజాసమస్యల్ని పరిష్కరించిన ఏడుగురు మంత్రులు, ఎంపీ, 28 మంది ఎమ్మెల్యేలు 

జీహెచ్‌ఎంసీ సహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 10,189 టన్నుల చెత్త తొలగింపు 

1,256 ప్రజా మరుగుదొడ్లు, 644 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పారిశుధ్య చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పట్టణప్రగతి మూడోరోజు కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై అక్కడికక్కడే స్పందించి పరిష్కరించారు. మున్సిపల్‌ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ, 28 మంది ఎమ్మెల్యేలతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీసహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 10,189 టన్నుల చెత్త, 1,059 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కనున్న పొదలు,  3,129 టన్నుల శిథిలవ్యర్థాలను తొలగించారు. 897 కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పూడిక తీశారు. మురుగు, వరద నీటికాల్వలు, కల్వర్టుల వద్ద 146 జాలీలను ఏర్పాటు చేశారు. 1,256  ప్రజా మరుగుదొడ్లు, 644 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, 546 మతపరమైన ప్రదేశాలు, పార్కులను శుభ్రంచేశారు.

182 లోతట్టు ప్రాంతాలను పూడ్చారు. 1,32,762 ప్రాంతాల్లో ఫాగింగ్, స్ప్రే చేశారు. 121 కిలోల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను సీజ్‌ చేసి, బాధ్యులపై రూ.15,303 అపరాధ రుసుం విధించారు. పనిచేయని, ఎండిపోయిన 71 బోర్లను మూసివేశారు. 36 ఇంకుడు గుంతలను పునరుద్ధరించడంతోపాటు కొత్తగా పదింటిని నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న 68 ఇళ్లను తొలగించినట్లు తెలిపారు.  

విద్యుత్‌ మరమ్మతులు.. వైకుంఠధామాలు 
125 విద్యుత్, నీటిమీటర్లకు మరమ్మతులు చేశారు. 26 మోటార్లకు కెపాసిటర్లు బిగించారు. 113 వంగిన స్తంభాలను సరిచేసి, 56 తుప్పు పట్టిన విద్యుత్‌స్తంభాలను మార్చారు. 2,100 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్‌ వైర్లను సరిచేశారు. 84 వైకుంఠధామాలు, శ్మశాన వాటికలను శుభ్రంచేశారు. 141 వైకుంఠధామాల పనులు ప్రారంభించారు. 28 వైకుంఠ రథాలను కొనుగోలు చేశారు. 25 మార్కెట్లు, రైతుబజార్లను శుభ్రం చేశారు. 42 క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు.  

మొక్కల సంరక్షణకు అనువుగా... 
పట్టణాలు, నగరాల్లో 24,045 మొక్కల మధ్య కలుపు తీసి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా 11,779, రోడ్ల మధ్యన ఉన్న పాదుల్లో 6, 844 మొక్కలను నాటారు.

కొత్తగా 36 స్థలాలను ట్రీ పార్కుల కోసం గుర్తించారు. కొత్త ట్రీ పార్కులో 2,252 గుంతలను మొక్కలు నాటడానికి అనువుగా తీశారు. 14,210 మొక్కలను ఇళ్లకు పంపిణీ చేశారు. మొక్కలు పెంచిన 21 మందిని సన్మానించారు. 320 ప్రదేశాల్లో పైపులైన్‌ లీకేజీలను గుర్తించి నీరు కలుషితం కాకుండా సరిచేశారు. 44 పంపు సెట్లను బ్రేక్‌డౌన్‌ కాకుండా సరిచేశారు. 321 మందికి ఒక రూపాయికి నల్లా కనెక్షన్‌ను ఇచ్చారు. 148 మందికి రూ.100కు నల్లా నీటి కనెక్షన్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు