Telangana: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!

10 Aug, 2022 11:01 IST|Sakshi

రేసులో అంజనీకుమార్, రవి గుప్తా, సీవీ ఆనంద్‌

ఐదుగురి పేర్లతో యూపీఎస్సీకి వెళ్లనున్న జాబితా

అందులోంచి ముగ్గురి పేర్లను సూచించనున్న పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

డిసెంబర్‌లో ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి రిటైర్మెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ బాస్‌ పోస్టు ఎవరికి దక్కుతుందన్న దానిపై పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త డీజీపీ రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసు వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం.. రాష్ట్ర పోలీసుశాఖలో ఐపీఎస్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్‌ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్‌ సింగ్, అంజనీకుమార్, రవిగుప్తా డీజీ (డైరెక్టర్‌ జనరల్‌) ర్యాంకులో.. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ రతన్, హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ ఇద్దరూ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు.

రేసులో ఎవరెవరు?
అందరిలోకి సీనియర్‌ అయిన ఉమేష్‌ షరాఫ్‌ 2023 జూన్‌లో రిటైర్‌ కానున్నారు. దీనితో ఆయనకు డీజీపీగా అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్‌ సింగ్‌ (ప్రస్తుత సీఐడీ చీఫ్‌) ఈ ఏడాది నవంబర్‌లోనే పదవీ విరమణ చేయనున్నారు. ఇదే బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్‌ (ఏసీబీ డీజీ), రవి గుప్తా (హోంశాఖ ముఖ్య కార్యదర్శి) ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారు. వీరు డీజీపీ పోస్టు రేసులో ఉంటారు. ఇక గోవింద్‌ సింగ్‌ పదవీ విరమణతో ఖాళీ అయ్యే డీజీ ర్యాంకు పోస్టులోకి రాజీవ్‌ రతన్‌ పదోన్నతి పొందుతారు.

ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా.. ప్రభుత్వం ఎక్స్‌ కేడర్‌ కోటా కింద మరో డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించేందుకు అవకాశం ఉంది. అంటే సీవీ ఆనంద్‌కు కూడా డీజీ ర్యాంకు పదోన్నతి రావొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన అంజనీకుమార్, రవిగుప్తాలతోపాటు రాజీవ్‌ రతన్, సీవీ ఆనంద్‌ కూడా డీజీపీ రేసులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకుని అదనపు డీజీపీ హోదాలో ఉన్న వారి పేరునూ డీజీపీ పోస్టు కోసం పరిశీలించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీపీ జితేందర్‌ పేరూ నియామక ప్యానల్‌ జాబితాలోకి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.

చదవండి: (Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే!)

డిసెంబర్‌ రెండో వారంలో..
రాష్ట్ర జీఏడీ విభాగం డీజీపీ నియామకానికి సంబంధించి ప్యానల్‌ లిస్ట్‌ను డిసెంబర్‌ రెండో వారంలో యూపీఎస్సీకి పంపనుంది. ఈ జాబితాలో ఉమేష్‌ షరాఫ్, రవిగుప్తా, అంజనీకుమార్, రాజీవ్‌ రతన్, సీవీ ఆనంద్, జితేందర్‌ పేర్లను పంపే అవకాశం ఉంది. 2023 జూన్‌లో రిటైర్‌ కానున్న ఉమేష్‌ షరాఫ్‌ పేరును పరిగణనలోకి తీసుకోకున్నా డీజీ హోదా అధికారి కాబట్టి పంపడం తప్పనిసరని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపే జాబితా నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ సెలెక్షన్‌ కమిటీ తిరిగి సూచిస్తుంది. అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంటుంది.

నియామకాల్లో కీలకం
రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్‌ శర్మ 2017 నవంబర్‌ వరకు సేవలు అందించారు. తర్వాత రెండో డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు ఆయన పదవిలో ఉంటారు. ఈ ఇద్దరూ కూడా హైదరాబాద్‌ కమిషనర్‌గా పనిచేసి డీజీపీగా నియమితులైనవారే కావడం గమనార్హం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ చాలా మంది డీజీపీలు హైదరాబాద్‌ కమిషనర్‌గా పనిచేసిన వారే. ప్రస్తుతం రేసులో ఉన్న అంజనీకుమార్‌ కూడా హైదరాబాద్‌ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ కొనసాగుతున్నారు.  

మరిన్ని వార్తలు