నేడు చింతమడకకు కేసీఆర్‌

30 Nov, 2023 02:45 IST|Sakshi

స్వగ్రామంలో ఓటు వేయనున్న సీఎం

పార్టీ పోలింగ్‌ సన్నద్ధతపై ఫామ్‌హౌస్‌ నుంచి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌/ సిద్దిపేట రూరల్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సిద్దిపేట నియోజకవర్గంలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్‌ దంపతులు ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకుంటారు.

గ్రామ పాఠశాలలోని 13వ బూత్‌లో ఓటు వేస్తారు. ఆ తర్వాత సీఎం తిరిగి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుని పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఖైరతాబాద్, మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట భారత్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సీఎం చింతమడకకు వస్తున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని సీపీ శ్వేత తెలిపారు.

అభ్యర్థులకు, నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడం, బుధవారం ‘సైలెన్స్‌ పీరియడ్‌’ కావడంతో గురువారం జరిగే పోలింగ్‌ ప్రక్రియ, అందుకు సంబంధించి పార్టీ పరంగా ఏర్పాట్లపై బీఆర్‌ఎస్‌ నేతలు దృష్టి సారించారు. పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి పోలింగ్‌ కోసం పార్టీ సన్నద్ధతపై ఆరా తీశారు.

కొందరు పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రచార సరళి, క్షేత్రస్థాయి పరిస్థితిపై నిఘా వర్గాలు, వివిధ సంస్థల నుంచి అందిన నివేదికలను పరిశీలించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. చివరి ఓటు పోలయ్యేంత వరకు పార్టీ పోలింగ్‌ ఏజెంట్లు బూత్‌లలోనే ఉండేలా చూసుకోవాలని, పార్టీ అనుకూల ఓటరు బూత్‌కు వెళ్లేలా పార్టీ కేడర్‌ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు