‘విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వం కుట్ర’

26 Mar, 2022 18:09 IST|Sakshi

హైదరాబాద్: విద్యుత్‌ చార్జీల పెంపు ప్రభుత్వం కుట్రగా అభివర్ణించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. విద్యుత్‌ చార్జీలు పెంచి రూ. 5596 కోట్ల రూపాయలు దండుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యుత్‌ సంస్థ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై శనివారం మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నాయన్నారు. ‘ఒకరి తప్పును మరొకరు కప్పిపుచ్చుకునేందుకే దొంగే దొంగ అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.

కరోనా తో ఇప్పటికే కోలుకోలేని విధంగా సామాన్యులు అల్లాడుతున్నారు. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు.ప్రభుత్వ సహాయం అందుతదేమో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటే.. జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో స్వయంగా నేను పాల్గొని చార్జీలు పెంచవద్దని స్వయంగా కోరాను. విద్యుత్ సంస్థ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం.పన్నెండున్నర వేల కోట్లు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించాలి.ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బిల్లులు ఎగవేయడం వల్ల 6 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తే.. విద్యుత్ భారం మోపాల్సిన అవసరం వచ్చేది కాదు.విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వం కుట్ర.

కేంద్రంలో బీజేపీ కూడా ఎన్నికల సందర్భంగా నాలుగు నెలల పాటు మిన్నకుండి.. ఇప్పుడు ప్రతీ రోజు ధరలు పెంచుతున్నారు. జీడీపీ పెంచుతాము అంటే అందరూ దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నారు.. కానీ ప్రతీ రోజు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారు. ప్రజలను దోచుకుంటున్న వాళ్లే ప్రజలను మభ్యపెడుతున్నాయి’ అని విమర్శించారు.

మరిన్ని వార్తలు