Yeswanthpur Train Accident: ఎంతో మందికి శోకాన్ని మిగిల్చిన ఘటనకు 67 ఏళ్లు

27 Sep, 2021 08:34 IST|Sakshi
యశ్వంతాపూర్‌ వాగు ఒడ్డున నిజాముద్దీన్‌ రైలు బోగీలు(ఫైల్‌)

సాక్షి, జనగామ(హైదరాబాద్‌): అన్నా క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. ఏవండి ఢిల్లీలో దిగగానే ఉత్తరం రాయండి.. సమయానికి భోజనం చేయడం మరచిపోకండి.. అంటూ ఆప్యాయతల పలకరింపుల అనంతరం రైలెక్కిన గంటకే ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన. ఒక్కటి కాదు.. రెండు కాదు.. మూడు వందల మందిని బలిగొన్న మహాప్రమాదం. అప్పటి ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా యశ్వంతాపూర్‌ వాగు రైలు ప్రమాద ఘటన జరిగి నేటికి (సోమవారం) 67 ఏళ్లు పూర్తవుతున్నాయి. నాటి ప్రమాదంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

67 ఏళ్ల క్రితం సెప్టెంబర్‌ 27న..
సరిగ్గా 67 ఏళ్ల క్రితం 1954 సెప్టెంబర్‌ 27న సోమవారం రాత్రి 10.10 నిమిషాలకు సికాంద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గ్రాండ్‌ టాక్‌ పేరుతో(నిజాముద్దీన్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలు దేశ రాజధాని న్యూఢిల్లీకి బయలుదేరింది. ఎవరి సీట్లలో వారు కూర్చుని ప్రయాణికులంతా నిద్రకు ఉపక్రమించారు. బయట కుండపోత వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన గంట తర్వాత రైలు జనగామ స్టేషన్‌కు చేరుకుంది.

యశ్వంతాపూర్‌ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడే 5 నిమిషాల పాటు నిలిపివేశారు. గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో బయలుదేరిన రైలు సరిగ్గా 11.15 నిమిషాలకు యశ్వంతాపూర్‌ వాగుపైకి చేరుకునే సమయంలో మూడు అడుగుల మేర పట్టాలు మునిగిపోయాయి. సిగ్నల్‌తో రూట్‌ క్లియర్‌గా ఉందని భావించిన రైలు డ్రైవర్‌ రైలును ముందుకు తీసుకెళ్లాడు. 17 బోగీలతో ఉన్న రైలు.. వాగుపై 12 బోగీలు దాటాక ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చివరి బోగీ మినహా మిగతా నాలుగు బోగీలు అందులో కొట్టుకుపోయాయి.

సుమారు 300 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోతుంటే.. ఏం జరుగుతుందో తెలియక మిగతా బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ కాలంలో సమాచార వ్యవస్థ సరిగా లేకపోవడంతో రైలు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెల్లవారుజాము వరకు దేశానికి తెలియలేదు. ఆ తర్వాత సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం అక్కడికి చేరుకుని అధికారులకు సహకరించారు.

రైలు మిస్సైయినా.. వెంటాడిన మృత్యువు
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిజామొద్దీన్‌ రైలు మిస్‌ కావడంతో.. ఓ వ్యాపారి కారులో భువనగిరి వరకు వచ్చి, ఉరుకులు.. పరుగుల మీద రైలెక్కాడు. అతడికి అదే చివరి ప్ర యాణంగా మిగిలిపోయింది. హైదరాబాద్‌ ప్యారడైజ్‌ థి యేటర్‌ యజమాని అంజయ్య.. సికింద్రాబాద్‌ చేరుకునే సరికే రైలు వెళ్లిపోవడంతో కారులో భువనగిరి వచ్చి రైలు ఎక్కాడు. రైలు ఎక్కిన 35 నిమిషాలకే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాగా, ఈ ప్రమాదం గురించి మాట్లాడితే ఈ ప్రాంతానికి చెందిన వృద్ధులు నేటికి కన్నీ టి  పర్యంతమవుతారు. రైలు ప్రమాదాన్ని  గుర్తు చేసుకుంటూ నేటి తరం యువతకు అప్పుడప్పుడు చెబుతుంటారు.   

కుటుంబాలు చిన్నాభిన్నం..
నిజాముద్దీన్‌ రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. సమాచార వ్యవస్థ సరిగాలేని నాటి రోజుల్లో ఈ ప్రమాద విషయం దేశానికి ఆలస్యంగా తెలిసింది. యశ్వంతాపూర్‌ వాగులో రైలు కొట్టుకుపోయిన విషయాన్ని తెలుసుకున్న బాధిత కుటుంబాలు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. తమవారు కనిపించకపోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో పిక్కటిల్లింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు.. కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన మృతదేహాలు చిద్రమై కనిపించడంతో వాగు శవాల దిబ్బగా మారిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న పలువురు క్షేమంగా ఉన్నప్పటికీ.. సమాచారం లేకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వారం రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. 
రైల్వే మంత్రి రాజీనామా 
యశ్వంతాపూర్‌ రైలు ప్రమాదం తెలుసుకున్న నాటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రీ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ.... ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.  

తల్లి ఒడిలో చిన్నారి..
రైలు వాగులో కొట్టుకుపోయిన సమయంలో ఓ చిన్నారితో సహా తల్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒడిలో కూతురును హత్తుకుని నీళ్లలో కొట్టుకుపోతూ ఓ చెట్టు కొమ్మకు చిక్కుకుని తల్లి అక్కడే మృతి చెందింది. అమ్మ మృతి చెందిన విషయం తెలియక చిన్నారి తెల్ల వార్లు ఎక్కిక్కి ఏడ్చింది. ఉదయం వ్యవసాయ పనులకు బయలుదేరిన యశ్వంతాపూర్‌ గ్రామానికి చెందిన కాశ మల్లయ్యకు చెట్ల పొదల్లో పాప ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లాడు. తల్లి చనినపోవడంతో పాపను రైల్వే అధికారులకు అప్పగించాడు. 

అమ్మమ్మ ఇంటి కాడ నుంచి వచ్చిన..
వాగులో రైలు కొట్టుకుపోయిన రాత్రి అమ్మమ్మ ఇంటి కాడ తాటికొండలో ఉన్న. విషయం తెలియగానే కాలినడకన పరుగు పరుగున వచ్చిన. ఆ సమయంలో నాకు పదేళ్ల వయస్సు. ఇంటికి వచ్చి నాయినతో కలిసి సక్కగా వాగు వద్దకు వెళ్లిన. చెల్లా చెదురుగా ఉన్న రైలు బోగీలు, ఏ చెట్టుకు చూసినా శవాలే కనిపించాయి. దుఖం ఆపుకోలేక పోయిన. చిన్నచిన్న చంటిపాపలూ ఉన్నారు. ఆనాటి ఘటన గుర్తుకు చేసుకుంటే రోజంతా బాధగానే ఉంటుంది.  
- కాముని మల్లేశం, యశ్వంతాపూర్‌

సంటి పిల్లతల్లిని కాపాడిన..
పొద్దుగాలనే నిద్రలేచి పొలం పనులకు బయలుదేరిన. వాగు వద్దకు వెళ్లగానే ఎవరో అరచినట్టుగా వినిపించింది. మొదటగా నీళ్ల సప్పుడు అనుకున్న. దగ్గరకు వెళ్లి చూస్తే పెద్ద పెద్ద డబ్బాలు కనిపించాయి. ఓ చెట్టును పట్టుకుని కిందకు దిగితే ఓ తల్లి చేతిలో బిడ్డను పట్టుకుని కాపాడండి అంటూ అరుస్తుంది. భయపడకు అంటూ ముందుకు వెళ్లిన. అన్నా నా బిడ్డను కాపాడు.. రాత్రి నుంచి చెట్టును పట్టుకున్నా.. ఇక ఓపిక లేదు అంటూ ఏడ్చింది. చెట్టుకున్న ఓ పొడవాటి కర్రను విరిచి ఆ తల్లి చేతికి ఇచ్చి పట్టుకోమని చెప్పిన. పది నిమిషాల పాటు కష్టపడి ఇద్దరిని కాపాడిన. ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తుంది. 
- మారబోయిన పుల్లయ్య, 90ఏళ్లు, యశ్వంతాపూర్‌ 

చదవండి: ‘నంబర్‌ వన్‌’ టార్గెట్టే ముంచిందా!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు