పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు  

1 Feb, 2023 02:06 IST|Sakshi

15 మంది విద్యార్థులకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్‌ సూచన  

ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం విజ్ఞాన్‌ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలోని విజ్ఞాన్‌ స్కూల్లో చదువుతున్న మండలంలోని అల్మాస్‌పూర్, రాజన్నపేట గ్రామాలకు చెందిన 22 మంది విద్యార్థులు స్కూల్‌బస్సులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్నారు.

ఎల్లారెడ్డిపేట శివారులోని రెండోబైపాస్‌ మూలమలుపు వద్ద కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో స్కూల్‌ బస్సు వెనుకభాగం ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌ వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో స్కూల్‌ బస్సులోని వెనుకసీట్లో కూర్చున్న విద్యార్థులు విహాన్, ఆదిత్య, దినేశ్, వినయ్, శివ, శివారెడ్డి, శ్రీనివాస్, తనుశ్రీ, మల్లికార్జున్, కావ్య, ధరణి, వర్షిణి, మణిసూదన్, మణిదీప్, సిద్దేశ్‌తోపాటు బస్సు క్లీనర్‌ అజయ్‌లు గాయపడ్డారు. రక్తం కారుతుండడంతో పిల్లలు భయాందోళనకు గురై రోదించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి రోదనలతో మిన్నంటింది.  

ఫోన్‌లో ఆరా తీసిన మంత్రి కేటీఆర్‌ 
ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ వెంటనే కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో ఫోన్‌లో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వెంటనే డీఈవో రాధాకిషన్‌ను అప్రమత్తం చేశారు. ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి చేరుకున్న డీఈవో రాధాకిషన్‌ ప్రమాద సంఘటనపై వివరాలు సేకరించి, విద్యార్థులను      పరామర్శించారు. 

మరిన్ని వార్తలు