రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు

11 Sep, 2023 02:53 IST|Sakshi

రేపు పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

రాష్ట్రానికి పశ్చిమ,వాయవ్య దిశ నుంచి వీస్తున్న బలమైన గాలులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతా­వరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వాయవ్య మధ్యప్రదేశ్‌ నుంచి, ఈశాన్య రాజస్తాన్‌పై వరకు, దక్షిణ చత్తీస్‌గఢ్‌ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5­కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈనెల 12వ తేదీన వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు వరుసగా నమోదవుతాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

22శాతం అధికవర్షపాతం నమోదు
ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో ఇప్పటివరకు 63.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఆదివారం సాయంత్రానికి 76.82 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 22శాతం అధికవర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా... 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశ నుంచి తక్కు­వ ఎత్తులో గాలులు బలంగా వీస్తు­న్నట్లు వాతావరణ శాఖ వివరించింది.  

మరిన్ని వార్తలు