హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ ఖ్యాతి

18 Feb, 2021 17:39 IST|Sakshi

ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్ నగరం

హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదారబాద్ ‌: గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నందుకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈక్రమంలో ఎఫ్‌ఏఓ, ఆర్బర్‌ డే ఫౌండేషన్‌ ప్రపంచంలోని 63 దేశాల నుంచి 120 నగరాలు పరిశీలించాయి. 

వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’‌గా ప్రకటించాయి. వీటిలో​ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది. భాగ్యనగరానికి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్ట్‌’గా గుర్తింపు దక్కడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హరితహారం వల్లే ఇది సాధ్యమయ్యిందని తెలిపారు.

హరితహారంలో భాగంగా గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుంచి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్‌ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్‌లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్‌లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

చదవండి: హైదరాబాద్‌లో హైరైజ్‌ బిల్డింగ్స్‌.. రికార్డ్‌ బ్రేక్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు