Stray Dogs: కుక్కలున్నాయ్‌... పిక్కలు జాగ్రత్త..!

19 Nov, 2021 08:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గౌతంనగర్‌: గౌతంనగర్‌ డివిజన్‌లో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. రాకపోకలు సాగించే వారిపై మూకుమ్మడి దాడి చేసి గాయపరుస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వీధి కుక్కలు కాలనీల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయని ఆయా కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఒంటరిగా బయటకు వెళ్తే కుక్కకాట్లకు గురి కావాల్సిందేనని వాపోతున్నారు.  

బయటికి వెళ్లాలంటే భయం..
గౌతంనగర్, మల్కాజిగిరి రైల్వేస్టేషన్, మల్లికార్జుననగర్, న్యూ అండ్‌ ఓల్డ్‌ మిర్జాల్‌గూడ, సంతోష్‌నగర్, ఏకలవ్యనగర్, సాయినగర్, సంజయ్‌నగర్, యాదవనగర్, వీణపానినగర్, రామాంజనేయనగర్, అన్నపూర్ణ  ప్రాంతాల్లో వీధి కుక్కల బె డద తీవ్రంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నా రు. కాలనీలలో ఒంటరిగా వెళ్లాలంటే ఏ క్షణంలో దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాత్రి సమయంలో కుక్కలు భయంకరంగా అరుస్తూ వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయని బస్తీ వాసులు వాపోతున్నారు. 

విధులు, పనులు ముగించుకుని రాత్రి పూట ద్విచక్ర వాహనాలపై వచ్చే క్రమంలో వెంబడించి గాయపరుస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లే దని ఆయా ప్రాంతాల వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు