చుక్కలనంటుతున్న కూరగాయలు.. కిలో వదిలి.. పావుకిలోతో సరి

11 Dec, 2021 14:29 IST|Sakshi

ఏది కొనాలన్నా కిలో రూ.50 పైనే..

దెబ్బతీసిన వరుస వర్షాలు

తగ్గిన దిగుబడులు.. పెరిగిన ధరలు

కొనలేమంటున్న సామాన్యులు

సాక్షి, హైదరాబాద్‌: కూరగాయలు కోయకుండానే.. వండకుండానే కుతకుతమంటున్నాయి. రోజురోజుకూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొనాలన్న కిలో రూ.50 పైమాటే. కిలో, అరకిలో కొనేవారు ప్రస్తుతం పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతంలో సంచితో మార్కెట్‌కు వెళ్తే రూ.100–150కి నిండేదని.. ఇప్పుడు రూ.500 పెట్టినా నిండడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. పచ్చడి.. పులుసుతో సర్దుకుంటున్నామని నిరుపేదలు వాపోతున్నారు.    

దిగుబడులు లేక..  
స్థానికుల అవసరాలతోపాటు హైదరాబాద్‌ నగరవాసులకు కావాల్సిన కూరగాయలను సైతం జిల్లాలోని రైతులు పండించి రవాణా చేస్తుంటారు. ఈ ఏడాది ఏకధాటిగా కురిసిన వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీశాయి. దిగుబడులు లేక మార్కెట్‌కు వచ్చే   ఉత్పత్తులు తక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 20 రోజుల నుంచి అదుపులోకి రావడం లేదు. వారం రోజుల క్రితం కాస్త తగ్గినట్లు తగ్గి మళ్లీ ఎగబాకుతున్నాయి. ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతోంది. మార్కెట్‌కు రూ.500 తీసుకుని వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవని.. ఇప్పుడు ఐదురోజులకు కూడా రావడం లేదని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: మెట్రోలో మతిమరుపు రామన్నలు.. పువ్వులో పెట్టి మరీ 

సాగుపై వర్షాల ప్రభావం 
జిల్లాలో ఈఏడాది రైతులు 49,768 ఎకరాల్లో కూరగాయలు, పండ్లతోటలను సాగు చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఎక్కువగా  ఆకుకూరలు, టమాట, తీగజాతి కూరగాయలు పండిస్తే.. షాద్‌నగర్‌ డివిజన్‌లో టమాట, వంకాయ, మిర్చి, తీగజాతికూరగాయలు..  మహేశ్వరం డివిజన్‌లో టమాట, ఆకుకూరలు, తీగజాతికూరలు.. చేవెళ్ల డివిజన్‌లో క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యారెట్, బీట్‌రూట్, టమాటను  ఎక్కువగా సాగుచేశారు. విడతల వారీగా వేసిన కూరగాయలను వర్షాలు వరుసగా వెంటాడుతూనే ఉన్నాయి. దిగుబడులు వచ్చే సమయంలో.. పూత, కాత దశలో కురిసిన వానలు నిండా ముంచాయి. మరోవైపు మార్కెట్‌లో కూరగాయల ధరలు రెట్టింపైనప్పటికీ దిగుబడులు లేక రైతులకు నష్టాలే ఎదురయ్యాయి.   

 కొనలేకపోతున్నాం..  
కూరగాయల ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. ఏది కొనాలన్నా కిలో 50 నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. కూలి పనులు చేసుకునే వారు కొనలేని పరిస్థితి. ధర పెరుగుదలతో వచ్చే కూలి ఏ మాత్రం సరిపోవడం లేదు. భారం మోయలేకపోతున్నాం.

  
– నర్సింలు, వ్యవసాయ కూలీ, ఆలూరు  

దిగుబడులు తక్కువగా వస్తున్నాయి 
ప్రస్తుత్తం మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా దిగుబడులు లేవు.  గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదు. ఏదైనా ఒక కూరగాయ  పంట తక్కువగా ఉంటే వాటికి మాత్రమే ఎక్కువ ధర ఉండేది. మిగతా వాటికి తక్కువగానే ఉండేవి. ఇప్పుడు ఏ కూరగాయకైనా ఎక్కువ ధరలు ఉన్నాయి.   
– రాఘవేందర్‌ గుప్తా, మార్కెట్‌ ఏజెంట్, చేవెళ్ల 

మార్కెట్‌లో కూరగాయల ధరలు  

కూరగాయ పేరు   (కిలోకు రూపాయల్లో..)     
టమాట     60–70
వంకాయ  50–60
దొండకాయ   60–70
చిక్కుడు 60–65
బెండకాయ  60–70
బీన్స్‌     70–80
బీరకాయ     70–80
కాకరకాయ   50–60
పచ్చిమిర్చి     70–80
గోకరకాయ    60–70
క్యాబేజీ    50–60
ఉల్లి     40 

మరిన్ని వార్తలు