ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వాకు టీఆర్‌ఎస్‌ మద్దతు

6 Aug, 2022 02:38 IST|Sakshi
మొక్కలకు నీళ్లు పోస్తున్న మార్గరెట్‌ అల్వా. చిత్రంలో టీఆర్‌ఎస్‌  ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, రాములు, వద్దిరాజు, సంతోష్‌కుమార్, కేకే 

ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపిన మార్గరెట్‌ అల్వా 

సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు మద్దతునివ్వాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు అల్వాకు ఓటు వేస్తారని తెలిపారు.

కాగా, మార్గరెట్‌ అల్వా.. సాయంత్రం కేకే నివాసంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో భేటీ అయ్యారు. కేకే, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావులు పార్టీ ఎంపీలను అల్వాకు పరిచయం చేశారు. తనకు మద్దతు తెలిపినందుకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

ఈ సందర్భంగా కేకే నివాసంలోనే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆమె ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీలు దామోదర్‌ రావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్, రాములు, పసునూరి దయాకర్‌లు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, మతం పేరిట సమాజాన్ని విభజిస్తున్నారని భేటీ అనంతరం కేకే మీడియాతో అన్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు తాము అల్వాకు మద్దతిస్తున్నామని తెలిపారు.   

మరిన్ని వార్తలు