విజయ పాలధర లీటర్‌ రూ.2 పెంపు

1 Jan, 2022 02:01 IST|Sakshi

నేటి నుంచి అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌/లాలాపేట: విజయ డెయిరీ పాల ధర మరోమారు పెరిగింది. కొత్త ఏడాది నుంచే ఈ ధర అమలులోకి వచ్చింది. టోన్డ్‌ మిల్క్‌ లీటర్‌కు రూ.2 చొప్పున పెంచినట్లు డెయిరీ ప్రకటించింది. ప్రస్తుతం రూ.47గా ఉన్న టోన్ట్‌ మిల్క్‌లీటర్‌ ధర నేటి నుంచి రూ.49కి పెంచినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సరఫరా చేయనున్న పాలకు ఈ పెంచిన ధరలు వర్తిస్తాయని, హోల్‌ మిల్క్‌ ధర లీటర్‌కు రూ.4 చొప్పున పెంచామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఈ పాలను పలురకాల సైజుల్లో ఉన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నందున సైజులవారీగా ధరలను పెంచుతూ విజయ డెయిరీ నిర్ణయం తీసుకుంది. డబుల్‌టోన్డ్‌ పాలు 200 మిల్లీలీటర్ల ప్యాకెట్‌ ధర రూ.9 నుంచి రూ.9:50కి పెరిగింది.

300 మిల్లీలీటర్ల ధర రూ.14 నుంచి రూ.15కు, 500 మిల్లీలీటర్ల ధర రూ.22 నుంచి రూ.23కు, ఆవుపాలు లీటర్‌పై రూ.48 నుంచి 50కు పెరిగింది. టోన్డ్‌ పాలు 200 మిల్లీలీటర్ల ప్యాకెట్‌ రూ.10 నుంచి రూ.10.50కు, 500 మిల్లీలీటర్ల ప్యాకెట్‌ రూ.24 నుంచి రూ.25కు పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచామని... కావున వినియోగదారులు సహకరించాలని విజయ డెయిరీ అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు