‘నేనే సూపరింటెండెంట్, నేను చెప్పిందే మీరు వినాలి’

4 May, 2021 08:35 IST|Sakshi
చిన్నారి కుటుంబ సభ్యులతో వాగ్వాదం చేస్తున్న వైద్యుడు

చికిత్స కోసం వచ్చిన వారిపై డాక్టర్‌ ఆగ్రహం

ములుగు ఏరియా ఆస్పత్రిలో ఘటన

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోలు

సాక్షి, ములుగు: వైద్యో నారాయణో హరి అంటారు. ఎలాంటి ఆపద వచ్చినా, తీవ్ర అనారోగ్యానికి గురైనా.. ప్రేమతో చూడాల్సిన వైద్యుడు చిన్నారి కుటుంబ సభ్యులను తీవ్ర దుర్భాషలాడిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన మాట్ల రవిరాజ్‌ కుమార్తె ఆక్సకు రాత్రి ఏదో పురుగుకుట్టినట్లుగా అనిపించింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు వెతకగా పాము కనిపించింది. దీంతో తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌ పట్టాభి పరిశీలించి చిన్నారిని ఎంజీఎంకు తరలించాలని సూచించారు. లేదు ఇప్పటికే ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇక్కడే వైద్యం అందించాలని కోరారు.

అయినా డ్యూటీ డాక్టర్‌ వినకపోవడంతో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆగ్రహానికి గురయిన డ్యూటీ డాక్టర్‌ సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేయడానికి మీరెవ్వర్రా అంటూ తీవ్రంగా దర్భాషలాడారు. ఈ ఆసుపత్రికి నేనే సూపరింటెండెంట్, నేను చెప్పిందే మీరు వినాలి, నేను మీ మాట వినాలా అంటూ కుటుంబసభ్యులపై దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పలువురు తీసిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. చివరికి చిన్నారి తండ్రి రవిరాజ్‌ దండం పెడుతున్న వీడియోలు చూసిన వారు ఏరియా ఆస్పత్రి వర్గాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా, చివరకు కుటుంబ సభ్యులు చిన్నారి ఆక్సను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతుంది. ఈ విషయమై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌ను వివరణ కోరగా సంబంధిత వీడియోలను చూశానని, ఇలాంటి సంఘటనలు ఇకముందు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు.

చదవండి: కరోనా టెస్ట్‌ చేయలేదని వ్యక్తి హల్‌చల్‌!

మరిన్ని వార్తలు