తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత..రాబోయే 4 రోజులు జ‌ర జాగ్ర‌త్త‌

17 Nov, 2022 07:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో చలికాల ప్రభావం మొదలైంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది. ఉదయం చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్‌ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్నారు. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒకవైపు.. తెలంగాణాలోని అన్ని జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాల్లో ఇప్పుడే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, అదిలాబాద్‌ జిల్లాల్లో చలి బీభత్సంగా కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. 

మరోవైపులోనూ ఏపీలోనూ చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాడేరులో 12, మినుములురులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అరుకులోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాబోయే నాలుగు రోజులు చలి విజృంభణ మరింతగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాతి పరిస్థితిని బట్టి మరిన్ని సూచనలు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు