వివాహేతర సంబంధం: సుపారీ ఇచ్చి ప్రియుడ్ని కిడ్నాప్ చేయించిన మహిళ.. సినీ ఫక్కీలో ఘటన

29 Jan, 2022 16:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌: మూడ్రోజుల క్రితం నర్సంపేట పట్టణంలోని కమలాపురంకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి శ్రీనివాస్‌ కిడ్నాప్‌ అయిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసును నర్సంపేట పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. విచారణను మమ్మురం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ను శుక్రవారం పోలీసులు ఓ కొలిక్కి తీసుకువచ్చారు. నర్సంపేట మున్సిపాలిటి పరిధి 2వ వార్డు కమలాపురం గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాస్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పాటు మద్యం షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు పైనాన్స్‌ (రోజువారీ చిట్టి) ఇచ్చాడు. రోజూ ఆమె ఇంటికి వెళ్తూ చిట్టీ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
చదవండి: వాట్సప్‌ చివరి స్టేటస్‌.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని..

ఈ క్రమంలో వారిద్దరూ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నారు. కొద్ది రోజులకు ఈ విషయం బయటకు పొక్కడంతో గతేడాది పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించారు. ఇచ్చిన అప్పు పోను కొంత నగదు ఆమెకు చెల్లించాలని తీర్మానం చేశారు. నాలుగు నెలల క్రితం ఈ విషయం బయటకు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళా శ్రీనివాస్‌ను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే సుపారీ గ్యాంగ్‌ను కలిసి కొంత నగదును అడ్వాన్స్‌గా అప్పగించింది.
చదవండి: పెగాసస్‌పై న్యూయార్క్‌ సంచలన నివేదిక.. మరోసారి దుమారం

దీంతో సుపారీ గ్యాంగ్‌ ఈనెల 26న శ్రీనివాస్‌ను కిడ్నాప్‌ చేసింది. శ్రీనివాస్‌ను కొట్టి ఆమెతో దండలు మార్పించినట్లు సమాచారం.  శ్రీనివాస్‌ కుమారుడు భరత్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొబైల్‌ ట్రాక్‌ చేసి నర్సంపేట సీఐ పులి రమేశ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన సుపారి గ్యాంగ్‌ పరారయ్యింది. పోలీసులు శ్రీనివాస్‌ ను, మహిళను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. దీనిపై స్థానిక సీఐ పులి రమేశ్‌ను వివరణ కోరగా.. ముత్యం శ్రీనివాస్‌ కొడుకు భరత్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు దొరికిన వెంటనే అరెస్టు చూపిస్తామని తెలిపారు. 
చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు 

మరిన్ని వార్తలు