‘బ్రౌన్‌’ హంగామా!

20 Sep, 2023 17:20 IST|Sakshi
బ్రౌన్‌ రకం రొయ్యలు

వలకు విరివిగా చిక్కుతున్న రొయ్యలు

గతేడాదికంటే పెరిగిన వివిధ రకాల రొయ్యల లభ్యత

4–5 రోజులకే వేట కుదిస్తున్న మత్స్యకారులు

స్థానికంగానే ఎక్కువ అమ్మకాలు

సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల వలకు రొయ్యలు ఆశాజనకంగా చిక్కుతున్నాయి. వీటిలో బ్రౌన్‌ రకం రొయ్యలు అధికంగా ఉంటున్నాయి. గతేడాది కంటే ఇటీవల రొయ్యల లభ్యత బాగుండడంతో మత్స్యకారుల మోములు వికసిస్తున్నాయి. మత్స్యకారులు సాధారణంగా 10–15 రోజుల పాటు రొయ్యల వేట సాగిస్తుంటారు. రొయ్యల కోసం బోటులో సముద్రంలో దూరంగా వెళ్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే రొయ్యలు లభ్యమవుతున్నాయి. దీంతో నాలుగైదు రోజులకే ఒక్కో బోటుకు అర టన్ను నుంచి టన్ను వరకు దొరుకుతున్నాయి.

దీంతో వేట సమయాన్ని నాలుగైదు రోజులకే కుదించుకుని హార్బర్‌కు చేరుకుంటున్నారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉంటూ మంచి ధర కూడా లభిస్తోంది. అదే పది రోజులకు పైగా వేట కొనసాగిస్తే వలకు చిక్కిన రొయ్యలను ఐస్‌లో రోజుల తరబడి బోట్లలోనే నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల రొయ్యల రంగు మారిపోయి, తాజాదనం కోల్పోయి తక్కువ ధర పలుకుతోంది. ఇది మత్స్యకారులకు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రొయ్యలు పుష్కలంగా లభిస్తున్నందున తక్కువ రోజుల వేటకే మొగ్గు చూపుతున్నారు.

విరివిగా బ్రౌన్‌ రొయ్యలు

కొన్నాళ్లుగా లభిస్తున్న రొయ్యల్లో బ్రౌన్‌ రకం రొయ్యలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి కిలో రూ.350 ధర పలుకుతోంది. ఎగుమతి చేసే రొయ్యల తలలు తీసివేస్తారు. వీటిని హెడ్‌లెస్‌ ష్రింప్‌గా పేర్కొంటారు. వీటికి కిలోపై రూ.100 వరకు ధర అధికంగా ఉంటుంది. గత సంవత్సరం ఈ సీజనులో వీటి ధర ఒకింత బాగున్నా తక్కువగా లభ్యమయ్యేవి. కానీ ఈ సీజనులో ఇవి విరివిగా దొరుకుతుండడంతో ఊరటనిస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో రొయ్యలు, చేపలను బాస్కెట్ల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. రొయ్యల్లో టైగర్‌, ఫ్లవర్‌, గోల్డ్‌/వైట్‌, బ్రౌన్‌/పింక్‌ తదితర రకాలుంటాయి.

ప్రస్తుతం కిలో టైగర్‌ రొయ్యలు రూ.1,100, ఫ్లవర్‌ రకం రూ.500, గోల్డ్‌/వైట్‌ రూ.300, బ్రౌన్‌ రకం రూ.350 చొప్పున ధర పలుకుతోంది. రొయ్యల కొనుగోలుదారులు, ఎగుమతిదారులు ఆశించినంతగా వీటిని కొనుగోలు చేయకపోయినా స్థానికంగానే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 70 శాతానికి పైగా బోట్లు సమీపంలోనే రొయ్యల వేట సాగిస్తున్నారని, దీంతో నాలుగైదు రోజులకే తీరానికి చేరుకుంటున్నారని వైశాఖి డాల్ఫిన్‌ బోట్‌ ఆపరేటర్ల సంక్షేమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సూరాడ సత్తిబాబు ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉండడంతో స్థానికంగా విక్రయాలు బాగా జరుగుతున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు