బడుగుల ఆత్మబంధువు సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

బడుగుల ఆత్మబంధువు సీఎం జగన్‌

Published Thu, Nov 23 2023 12:58 AM

మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ, చిత్రంలో మంత్రి అమర్‌నాథ్‌ - Sakshi

డాబాగార్డెన్స్‌: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు విజ్ఞానవంతులవుతుంటే చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని బీసీ సంక్షేమ, పౌరసంబంధాల శాఖ మంత్రి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. సామాజిక సాధికారతకు అర్థం చెప్పింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు దృష్టిలో సామాజిక సాధికారత అంటే తన సామాజిక వర్గానికే మేలు చేయడమని ఎద్దేవా చేశారు. అతని దృష్టిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరూ కాదన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో బుధవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఓ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు వేసుకుని చంద్రబాబు తన సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తే.. నా బీసీ.. నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా మైనార్టీ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందలం ఎక్కించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే.. తోలు తీస్తానని మత్స్యకారులను చులకన చేస్తూ మాట్లాడారని.. ఒకానొక సందర్భంలో ఎస్సీలో పుట్టాలా అని ఎస్సీలను కూడా హేళన చేశారన్నారు. నాయీ బ్రాహ్మణులు ఆలయాల్లో తమకు ప్రాధాన్యమివ్వాలని కోరితే.. ఎవడురా మిమ్మల్ని ఇక్కడకు రానించాడంటూ చంద్రబాబు చులకన చేసిన మాట్లాడారని గుర్తు చేశారు. సీఎం జగన్‌ మత్స్యకారుల కష్టాలను తన కష్టాలను భావిస్తారని, ఇటీవల ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఏ ఒక్క బోటు యజమాని నష్టపోకుండా 80 శాతం మేర నష్టపరిహారం ప్రకటించారన్నారు. నాయీ బ్రాహ్మణులకు వృత్తి పరంగా ఆలయాల్లో స్థానం కల్పించి ఔదార్యం చాటుకున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆత్మబంధువుగా, ఆత్మరక్షకుడిగా సీఎం జగన్‌ నిలిచారన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కులగణనకు నాంది పలికారన్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సామాజిక న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని.. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత ఆ కల నెరవేరిందన్నారు. రూ.2.38లక్షల కోట్లతో సంక్షేమ ఫలాలు అందించారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చారన్నారు. అందుకే సామాజిక సాధికార యాత్రలో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతున్నామన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెంటే ఉన్నారన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌.ఎ.రెహ్మాన్‌, చింతలపూడి వెంకట్రామయ్య, సీనియర్‌ నాయకుడు అక్కరమాని వెంకటరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement