వినిపించని ‘కిచకిచ’

20 Mar, 2023 01:24 IST|Sakshi
పిచ్చుక
● కనుమరుగవుతున్న పిచ్చుకలు ● సెల్‌టవర్స్‌ రేడియేషన్‌తో అంతరించిపోతున్న జాతి ● పర్యావరణ కలుషితం కూడా కారణమే ● నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

రాజాం: గ్రామాల్లో పూరింటి గడప పెడకల్లోను, పశువుల శాలల పెడకల్లో కనువిందుచేసే పిచ్చుకలు ప్రస్తుతం కనిపించడంలేదు. ఎక్కడ పడితే అక్కడ పిచ్చుకలు కనిపించడం, వాటి కిచకిచ ధ్వనులు వినిపించడం గగనంగా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడం, సెల్‌టవర్‌ రేడియేషన్‌ కారణంగా పిచ్చుకల్లో పునరుత్పత్తి తగ్గిపోవడంతో ఆ జాతి జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి. ఫలితంగా వాటి మనుగడ భవిష్యత్‌ తరాల్లో కేవలం గోడలపై ఫొటోలకే పరిమితం కావచ్చేమోనని పర్యావరణ ప్రేమకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవగాహన కోసం దినోత్సవం

చిన్నపాటి అవకాశం ఉన్న జీవించగల పక్షి పిచ్చుక. అటువంటి పిచ్చుక అంతరించిపోతున్న తరుణంలో భవిష్యత్‌లో మానవ మనుగడ కూడా కష్టమేనని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. పిచ్చుకలు అంతరించిపోవడానికి సెల్‌ తరంగాలు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. పర్యావరణ కలుషితం మరో కారణమని, భవిష్యత్‌లో ఇది మానవజాతిపై కూడా ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో పిచ్చుక జాతిని కాపాడేందుకు ప్రతి ఏడాది మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా పిచ్చుకల గురించి అవగాహన పెంచుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజలు దృష్టిసారించే అవకాశం కూడా ఉంది.

కృత్రిమ పిచ్చుకలే..

బూడిద రంగులో తళతళమెరిసే వెంట్రుకలతో అందంగా కనిపించే పిచ్చుకల్లో ఎక్కువగా పెరడు పిచ్చుకలు అందరికీ పరిచయం. ఇండ్ల వద్దే కాకుండా తాటి, ఈత చెట్లుపై గడ్డిపీచుతో గూళ్లు కట్టి ప్రకృతిలో రమణీయతను చాటుకునే పిచ్చుక గూళ్లు ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు. పట్టణాల్లో కృత్రిమ పిచ్చుకలను తయారుచేసి, వాటికి రంగులు అద్ది విక్రయిస్తుంటే వాటిని ఇంటికి తీసుకొచ్చి ఆప్యాయంగా నెలరోజులు పెంచి తరువాత వదిలేయడం పరిపాటిగా మారింది.

పిచ్చుక జాతికి గౌరవం

పిచ్చుక జాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలియజేస్తూ ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదలచేసింది. ఈ స్టాంప్‌పై పిచ్చుక ఫొటోను ముద్రించి పిచ్చుకజాతిని గౌరవించింది. అంతేకాకుండా ఎన్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ గుజరాత్‌ రాష్ట్రంలో మార్చి 2011 నుంచి పిచ్చుక అవార్డులు ఇస్తోంది.

పిచ్చుక మంచి ఆర్కిటెక్‌

తన గూడులోకి ఏ రకమైన విష జంతువు చొరబడకుండా పిచ్చుక మంచి ఆర్కిటెక్చర్‌లాగా గూడు కట్టుకోగలదు. ఒక ప్రవేశ మార్గాన్ని గూడు దిగువనుంచే ఇచ్చి మరో వైపు గుడ్లు పొదిగేందుకు, పిల్లలు ఉండేందుకు ఆవాసాన్ని నిర్మించుకుంటుంది. సృష్టి నుంచి మనం నేర్చుకున్న అద్భుతాల్లో పిచ్చుక గూడు నుంచి కూడా అద్భుతమైన నిర్మాణాలు నేర్చుకున్నాం.

పర్యావరణ హితులు..

పిచ్చుకలు పర్యావరణ హితులు. అవి అంతరించిపోతున్నాయంటే పర్యావరణం కలుషితమవుతోందని అర్థం. ఈ కారణంగా మానవజాతి కూడా ప్రమాదంలో పడనుంది. పిచ్చుకలకు ఆహారం దొరకకపోవడం, యవ్వన అవసరమైన కీటకాలు లభించకపోవడం, సంతనోత్పత్తకి అనువైన పరిసరాలు లేకపోవడంతో వాటి జాతి అంతరించిపోతోంది. పొలాల గట్లు, చెట్లపై ఉండే పిచ్చుకలకు చెట్లు విచ్చలవిడిగా నరికేయడంతో ఆవాసాలు లేక తగ్గిపోతున్నాయి. అక్కడక్కడ పంటపొలాల్లో విద్యుత్‌తీగలు, తాటిచెట్లకు మాత్రమే ఇప్పుడు పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు