‘అభివృద్ధి’ ప్రణాళికలు సమర్పించాలి

19 Dec, 2023 01:00 IST|Sakshi
మాట్లాడుతున్న కమిషనర్‌ షేక్‌రిజ్వాన్‌బాషా

బల్దియా కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

అధికారులతో సమీక్ష సమావేశం

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో 2014 నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు, నిధులకు సంబంధించిన ప్రణాళికలు సమర్పించాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. ఈ మేరకు సోమవారం గ్రేటర్‌ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు దఫాల్లోని ప్రభుత్వాల హయాంలో పూర్తయిన, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, మంజూరైన, పెండింగ్‌ నిధులపై వివరాలు సమర్పించాలన్నారు. ప్రారంభించని అభివృద్ధి పనులను నిలిపివేయాలని సూచించారు. సీఎం, స్మార్ట్‌సిటీ, అమృత్‌, పట్టణ ప్రగతి, ఆర్థిక సంఘాలు తదితర నిధుల వివరాలు ఇవ్వాలని చెప్పారు. గ్రీవెన్స్‌, విభాగాల వారీగా ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ, పెండింగ్‌పై సమీక్షించిన ఆయన వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. పన్నుల వసూళ్లు పెంచడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, నీటి సరఫరా తీరుపై ఏఈల వారీగా వారి పరిధిలోని కనెక్షన్లు, అత్యధికంగా బకాయి ఉన్న 100 మంది చెల్లింపుదారుల సమాచారంతో త్వరలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలన్నారు. ఈనెల మూడో శనివారంలోగా పెండింగ్‌లో ఉన్న గ్రీవెన్స్‌ దరఖా స్తులు పరిష్కారించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు అనిసుర్‌ రషీద్‌, రవీందర్‌ యాదవ్‌, ఎస్‌ఈలు కృష్ణారావు, ప్రవీణ్‌ చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజేష్‌, సిటీ ప్లానర్‌ వెంకన్న, బయాలజిస్ట్‌ మాధవరెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, డిప్యూటీ కమిషనర్‌ కృష్ణారెడ్డి, టీపీఆర్‌ఓ రాజేష్‌ కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పన్నుల చెల్లింపునకు పేటీఎం స్వైప్‌ మిషన్లు

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌కు చెందిన ఈ–సేవా కేంద్రాల్లో పేటీఎం స్వైప్‌ మిషన్లను త్వరలో అందుబాటులోకి తేవాలని కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. సోమవారం హన్మకొండలోని నక్కలగుట్ట, అశోకా థియేటర్‌, నయీంనగర్‌ ఈ–సేవా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పన్నుల వసూళ్ల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఈ–సేవా కేంద్రాల్లో ఆస్తి, నీటి, చెత్త, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల చెల్లింపునకు అత్యాధునీక సాంకేతి పరిజ్ఞానాన్ని పటిష్టపర్చాలన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న 9 ఈ–సేవా కేంద్రాల్లో రెండేసీ పేటీఎం స్వైప్‌ మిషన్లను యుద్ధప్రతిపాదిక కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా చెప్పారు.

>
మరిన్ని వార్తలు