మహావీర్‌ మ్యూజియానికి మంచి రోజులు

20 Mar, 2023 00:56 IST|Sakshi
మ్యూజియం ఆవరణలో చెల్లాచెదురుగా శిల్పాలు

కడప కల్చరల్‌ : కడప నగరంలోని భగవాన్‌ మహావీర్‌ మ్యూజియంకు మంచిరోజులు రానున్నాయి. దాంతోపాటు జమ్మలమడుగు సమీపాన గల మైలవరం రిజర్వాయర్‌ వద్దనున్న మ్యూజియంకు కూడా మహర్దశ పట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పురావస్తుశాఖ ప్రయత్నాలు చేస్తోంది. శిథిల భవనాలలో నడుస్తున్న మ్యూజియంలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తొలిదశలో కడప నగరంలోని మహావీర్‌ మ్యూజియం, అనంతరం మైలవరం మ్యూజియంలకు శిథిల భవనాల స్థానంలో నూతన భవనాలు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకతలు గల శిల్పాలు, శాసనాలు, పురాతన వస్తువులతో విశాఖపట్టణంలో వైఎస్సార్‌ స్టేట్‌ మ్యూజియంను నిర్మించనున్నారు.

41 ఏళ్ల క్రితం నిర్మాణం

కడప మహావీర్‌ మ్యూజియం గురించి జిల్లా వాసులందరికీ తెలిసిందే. 41 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని కలెక్టరేట్‌ సర్కిల్‌లో స్థానిక జైనుల సహకారంతో మ్యూజియం నిర్మించారు. జైనులు తమ ఆరాధ్యదైవమైన భగవాన్‌ మహావీరుని పేరిట ఈ మ్యూజియాన్ని నిర్మింపజేశారు. నాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్‌ భవనాన్ని ప్రారంభించగా, పురావస్తుశాఖ మంత్రి పి.జనార్దన్‌రెడ్డి శిల్పశాసన విభాగాన్ని ప్రారంభించారు. గండికోట ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆ ప్రాంతంలో లభించిన శిల్పాలు, శాసనాలు, జిల్లాలోని ఇతర ప్రాంతాలలో లభించిన అన్నింటినీ ఈ మ్యూజియంకు చేర్చారు. ఇందులో పదుల సంఖ్యలో అరుదైన శాసనాలు దాదాపు 100కు పైగా విభిన్న శిల్పకళాశైలిని తెలిపే శిల్పాలు, పురాతన ఖడ్గాలు, వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. 15 ఏళ్లపాటు మ్యూజియం సందర్శకులతో కళకళలాడింది. కాలానుగుణ మార్పులు, కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో సందర్శకుల సంఖ్య తగ్గింది. భవనం పూర్తిగా దెబ్బతినింది. వర్షం వస్తే పైకప్పు పూర్తిగా నీరు కారుతూ తడిచి ఏ క్షణాన కూలిపోతుందోనన్న భయం గొల్పుతోంది. అడపాదడపా వచ్చిన సందర్శకులపై పైకప్పు గచ్చులు ఊడిపడుతుండడంతో వారి రాక పూర్తిగా తగ్గిపోయింది. సాక్షాత్తు ఓ కలెక్టరే దానిని బూత్‌బంగ్లాగా అభివర్ణించారు. ఓ ఉద్యోగి మినహా అందులో ఎవరూ ఉండడం లేదు. ఇటీవల నూతన కలెక్టరేట్‌ నిర్మాణ సమయంలో వెలుపలి వైపు పూర్తిగా గోడ కట్టేడంతో మ్యూజియం పూర్తిగా కనపడటం లేదు.

కొత్త భవనం అవకాశం

రాష్ట్రంలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నడుస్తూ శిథిల స్థితికి చేరుకున్న మ్యూజియంలకు కొత్త భవనాలను నిర్మించేందుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సందర్శకులకు శిల్పాలు, శాసనాలు స్పష్టంగా కనిపించేలా పూర్తి స్థాయి రక్షణతో వీటిని నిర్మించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఇటీవల రాష్ట్ర పురావస్తుశాఖ కమిషనర్‌ జి.వాణిమోహన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా కడప నగరంలోని మహావీర్‌ మ్యూజియం నూతన భవన నిర్మాణాలకు రూ.10 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని మైలవరం మ్యూజియానికి కూడా నూతన భవనాలు కావాలంటూ స్థానిక పురావస్తుశాఖ అధికారులు కోరడంతో సంబంధిత అధికారులు దాన్ని కూడా పునర్‌ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

శాసనాల రక్షణ కోసం ప్రత్యేక మ్యూజియం

ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేనన్ని శాసనాలు కేవలం మన రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్సార్‌ జిల్లాలో లభించాయన్న విషయం తెలిసిందే. తొలి తెలుగు శాసనమైన కలమల్ల శాసనం కూడా మన జిల్లాలోనే లభించింది. రెండో శాసనం సమీపంలోని ఎర్రగుడిపాడులో వెలుగు చూసింది. ఇంకా కేవలం తెలుగు శాసనాలే కాకుండా అరబ్బీ, ఉర్దూ, ఆంగ్ల శాసనాలు కూడా జిల్లాలో లభించినట్లు తెలుస్తోంది. గండికోటలోనూ, లోయ గ్రామాలలోనూ దాదాపు 1000 శాసనాలు ఉన్నట్లు ఆ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. రక్షణ లభించకపోవడంతో చరిత్రకు సాక్షాలుగా నిలిచి ఉన్న ఇలాంటి విలువైన వారసత్వ సంపద కళ్లముందే శిథిలమై పోతుండటం పట్ల పలువురు చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి శాసనాలను రక్షించడం కోసం రాష్ట్ర పురావస్తుశాఖ ప్రత్యేకంగా శాసన పరిరక్షణ కోసమే శాసన మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. ఆ మ్యూజియం అందుబాటులోకి వస్తే మన జిల్లాలోని విలువైన శాసనాలకు శాశ్వతంగా రక్షణ లభించే అవకాశం ఉంది.

ఆమోదం కోసం మైలవరం మ్యూజియం డీపీఆర్‌

విశాఖలో వైఎస్సార్‌ పేరిట

స్టేట్‌ మ్యూజియం

జిల్లాలోని శాసనాలకు లభించనున్న రక్షణ

మరిన్ని వార్తలు