22న ల్యాబ్‌ టీచర్లకు శిక్షణ | Sakshi
Sakshi News home page

22న ల్యాబ్‌ టీచర్లకు శిక్షణ

Published Sat, Nov 18 2023 1:48 AM

లక్ష్మీనరసింహను అభినందిస్తున్న వీసీ, రిజిస్ట్రార్‌   - Sakshi

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లకు సంబంధించి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 16 ల్యాబ్‌ల ఇన్‌చార్జి టీచర్లకు ఈ నెల 22వ తేదీన ఒక్కరోజు శిక్షణ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం విజయవాడలోని సాయిజువెల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరుగుతుందన్నారు. 16 ల్యాబ్‌ల ఇన్‌చార్జి టీచర్లు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. ఇది ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ఆదేశమని తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి మహేశ్వరెడ్డిని 9441035830 ఫోన్‌ నంబర్లో సంప్రదించాలని డీఈఓ తెలిపారు.

22న వెయిట్‌లిఫ్టింగ్‌ ఎంపికలు

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలోని వ్యాయామవిద్య, క్రీడాశాస్త్ర శాఖ ఆవరణంలో ఈనెల 22వ తేదీ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వైవీయూ క్రీడాబోర్డు కార్యదర్శి డా. కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొనే పురుషులు, మహిళల జట్టుకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపికలకు హాజరయ్యే వారు కళాశాల స్టడీ సర్టిఫికెట్‌, పది, ఇంటర్‌, డిగ్రీ మార్కులిస్టులు, జిరాక్స్‌ ప్రతులను తీసుకురావాలన్నారు. 17 నుంచి 25 సంవత్సరాలలోపు విద్యార్థులు ఎంపికలకు అర్హులన్నారు.

20న ధృవపత్రాల పరిశీలన

కడప కోటిరెడ్డిసర్కిల్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పరిధిలో జాతీయ అర్బన్‌ ఆరోగ్య పథకంలో ఏర్పడిన తొమ్మిది మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల జాబితాను హెచ్‌టీపీపీఎస్‌://కడప.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్‌ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం కడపలో ధృవపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.

ఎన్‌సీఈఆర్‌టీకి ఎంపిక

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం సైకాలజీ శాఖ అకడమిక్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఎం. లక్ష్మీనరసింహా ఢిల్లీలోని జాతీయ విద్యా, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సైకాలజీ అండ్‌ ఫౌండేషన్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యాడు. సైకాలజీ విభాగాధిపతి డా. కె. లలిత, సహ ఆచార్యులు డా. వి. లాజరస్‌ ఆధ్వర్యంలో డా. లక్ష్మీనరసింహా మర్యాదపూర్వకంగా వీసీ, రిజిస్ట్రార్‌లను కలిశారు. వారు ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు బి. రవి. అశ్వర్థరెడ్డి, టి. సురేష్‌బాబు పాల్గొన్నారు.

చిట్వేలిలో కబడ్డీ పోటీలు

చిట్వేలి: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడా వ్యవస్థాప కార్యదర్శి పీడీ.డేవిడ్‌ప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శని, ఆది, సోమవారాల్లో మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. జిల్లా ఎస్టీఎప్‌ఐ కార్యదర్శి వసంత మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులకు ప్రయాణ ఖర్చులు, క్రీడా దుస్తులు, ప్రభుత్వమే అందిస్తుందన్నారు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

కడప జోన్‌కు 400 బస్సులు

రాజంపేట: కడప ఆర్టీసీ జోన్‌కు వచ్చే ఏడాది మార్చి నాటికి 400 కొత్త బస్సులు రానున్నాయని కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు అన్నారు. రాజంపేట ఆర్టీసీ డిపోను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 200 కొత్త బస్సులు రొడ్డెక్కాయని తెలిపారు. గత ఏడాది ఆర్టీసీ రూ.330 కోట్ల నష్టాల్లో నడిచిందని, ఈ ఏడాది రూ.21 కోట్లు తగ్గించగలిగామన్నారు. డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నెలలో రెండు సార్లు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రయాణికులతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టరు మర్యాదగా ప్రవర్తించాలన్నారు. సంస్ధను లాబాల బాటలో నడిపించేందుకు ఆర్టీసీ కార్గో సేవలు చేపట్టిందని తెలిపారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లోని అన్ని డిపోల పరిధిలో మెరుగైన సేవలందించే విషయంలో మార్గదర్శకాలను తీసుకొస్తామన్నారు. అనంతరం డిపో సర్వీసులపై సమీక్షించారు. నాలుగు రూట్‌లలో గిప్ట్‌ స్కీం పెట్టాలని సూచించారు. బస్టాండు, కార్గో పాయింట్‌ను పరిశీలించారు. ఈడీని రాజంపేట డిపో కార్మికసంఘాల నేతలు కలిశారు. వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ తరపున నరసింహులు, ఎంప్లాయిస్‌ యూనియన్‌ తరపున మౌలా తదితర నేతలు ఈడీని కలిసి సమస్యలను విన్నవించారు.

Advertisement
Advertisement