కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం

27 Sep, 2021 08:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెల్లవారుజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగుళూరు నుండి 52 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టింది.

రన్ వేపై అధిక వర్షం పడడంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు ఏటీసీ అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో సుమారు 50 నిమిషాలు పాటు గాల్లో 10 సార్లు చక్కర్లు కొట్టింది. 50 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో పైలెట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీనితో విమానంలో 52 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అదే విమానంలో గన్నవరం విమానాశ్రయం నుండి 57 మంది ప్రయాణికులు బెంగుళూరు వెళ్లేందుకు లాంజ్‌లో పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ విమానం ఉదయం 7.35కి గన్నవరం వచ్చి తిరిగి 8 గంటలకు బెంగుళూరు వెళ్లనుంది.  చదవండి: (గులాబ్‌ తుపాన్‌ ప్రభావం: పలు రైళ్లు రద్దు)

మరిన్ని వార్తలు