రైతు కంట కన్నీరే..

27 Jan, 2018 04:40 IST|Sakshi

రాష్ట్రంలో ధాన్యం, వేరుశనగ రైతుల దైన్యం 

ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు..

కొనుగోలు కేంద్రాల్లోనూ గిట్టుబాటు ధరలో కోతలు

కొనుగోలు చేసిన పంటకు చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌

ధాన్యం సేకరణ లక్ష్యం 52 లక్షల మెట్రిక్‌ టన్నులు

సేకరించింది కేవలం 25 లక్షల మెట్రిక్‌ టన్నులే

ఏ ఊరి ధాన్యం ఆ ఊరిలోనే అమ్మాలనే నిబంధన

గోదాములు లేవంటూ వేరుశనగ కొనుగోలు కేంద్రాల మూత

కేంద్రం నిధులిచ్చినా కొనుగోలు చేయలేని రాష్ట్రం 

11.70 లక్షల క్వింటాళ్లకు 3.07 లక్షల క్వింటాళ్ల కొనుగోలు

రూ.120 కోట్లకు రూ.25 కోట్లే చెల్లించిన ఆయిల్‌ఫెడ్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే 48 గంటల్లో బ్యాంకు అకౌంట్‌కు డబ్బు జమ అవుతుందని అధికారులు చెప్పారు. విక్రయించి 20 రోజులు గడిచినా ఇంకా నా అకౌంట్‌కు డబ్బు జమ కాలేదు. ఇలాగైతే కూలీలకు కూలి ఎప్పుడు ఇవ్వాలి? పెట్టుబడి కోసం అప్పు తెచ్చిన చోట అప్పు ఎలా కట్టాలి? ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలి
–కేవీ సుబ్బారావు, మంతెన గ్రామం, కృష్ణా జిల్లా

ఖరీఫ్‌లో నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఎకరాకు 22 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో అమ్ముకోవడానికి పోతే క్వింటాల్‌ రూ.3,500 అడుగుతున్నారు. ఆయిల్‌ఫెడ్‌ కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రేపో మాపో కొంటామని చెబుతూ వచ్చిన అధికారులు తీరా సెంటర్లను మూసివేయడం దారుణం.   
 – నాగరాజు, గమ్మరాళ్ల, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా

ఇది సుబ్బారావు, నాగరాజుల ఆవేదనే కాదు... రాష్ట్రంలోని రైతులందరిది అదే రోదన. ఆరుగాలం చెమటోడ్చి పండించడం ఒక  ఎత్తయితే... పండించిన పంటను అమ్ముకునేందుకు అంతకుమించి శ్రమించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు పట్టించుకునే నాధుడే లేదు. తేమ శాతం పేరుతో ధాన్యం ధరలో ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారు. గోదాములు లేవంటూ వేరుశనగ కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. ఎలాగోలా పంట విక్రయించినా డబ్బుల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో వ్యవసాయ కార్మికులు, ట్రాక్టర్లు, ధాన్యం నూర్పిడి యంత్రాలకు నగదు చెల్లించేందుకు దళారులు ఇచ్చిన రేటుకు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. లేదంటే బంగారం తాకట్టు పెట్టి ఆ ఖర్చులకు నగదు చెల్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరల ప్రకటనలతోనే సరిపుచ్చుకోవడంతో రాష్ట్రంలో ధాన్యం, వేరుశనగ విక్రయాల తీరు, రైతుల కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌...

పెండింగ్‌లో రూ.వందల కోట్ల బిల్లులు
ధాన్యం, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్లలో ఘోరంగా విఫలమయ్యాయి. కొనుగోలు చేసిన పంటకు వెంటనే చెల్లింపులు జరపకపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ధాన్యం రైతులకు రూ.324.73 కోట్లు, వేరుశనగ రైతులకు దాదాపు రూ.100 కోట్లు చెల్లింపులు బకాయి ఉన్నాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసి, రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు కోసం 52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్‌ సీజన్‌లో ఏ– గ్రేడ్‌ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1,590, సాధారణ రకానికి రూ. 1,550గా మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్తున్నా తేమ శాతం పేరుతో క్వింటాల్‌కు రూ. 1480 మించి ఇవ్వడం లేదు.

ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిద్దామంటే అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి మోసాలు లేకుండా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రవాణా, డీఆర్‌డీఏ, ఏటీడీఏ, ఐఅండ్‌పీఆర్‌ శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ సొసైటీ(పీఏసీఎస్‌)లు, జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌)లు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా రైతుల బ్యాంకు అకౌంట్లకు డబ్బు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా నెలలు గడుస్తున్నా జమ కావడం లేదు. ప్రభుత్వం ఇప్పటివరకు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో దాదాపు 20 వేల మంది రైతులకు రూ.324.73 కోట్ల విలువ చేసే బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వేరుశనగ రైతులకు ప్రభుత్వం రూ.120 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.25 కోట్లనే చెల్లించింది. రైతులకు తక్షణం నగదు చెల్లింపులు చేయడానికి రూ.100 కోట్లను సర్దుబాటు చేయాలని ఆయిల్‌ఫెడ్‌ అధికారులు విజ్ఞప్తి చేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకోవడంతో రైతులకు నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. 

కొత్త నిబంధనలతో రైతుకు నష్టం
మరోవైపు ప్రభుత్వం రూపొందించిన ఈ–క్రాప్‌ వెబ్‌సైట్‌లో రైతులు తమకున్న పొలం వివరాలు నమోదు చేసుకోకపోతే కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. సాగు వివరాలు ఈ–క్రాప్‌ వెబ్‌సైట్‌లో నమోదుకాని రైతులు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ లేదా గ్రామ కార్యదర్శి జారీ చేసిన సర్టిఫికేట్‌ తీసుకొని వెళ్తేనే ధాన్యం విక్రయించాలనే నిబంధన ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాదారు పుస్తకాలు లేకపోయినా రైతులు ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. కౌలుదారుల సంగతి సరేసరి. సాగు ధ్రువీకరణపత్రాలు, కౌలు గుర్తింపు కార్డులు ఉంటేనే పంటను అమ్ముకోగలుగుతున్నారు. మరోవైపు ఏ ఊరిలో పండిన ధాన్యాన్ని ఆ ఊరి మిల్లులోనే అమ్మాలని ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆ ఊరి ఆయకట్టులో పండిన మొత్తం పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు అనుమతి లేనందున రైతులు ఎప్పటికైనా తమ వద్దకే ధాన్యాన్ని తీసుకొస్తారనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వ్యాపారుల మధ్య పోటీ ఉండటంతో రైతుకు మంచి ధరే లభించేది. కొందరు వ్యాపారులు రైతులకు అవసరమైన ఖర్చులకు డబ్బును ఇచ్చేవారు. ఇప్పుడు వారంతా రైతులకు పెట్టుబడి పెట్టడం మానేశారు. దీంతో అటు ప్రభుత్వమూ డబ్బు చెల్లించక, ఇటు వ్యాపారులు డబ్బు ఇవ్వక రైతుల పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా మారింది.  

వేరుశనగ కొనుగోళ్లు నిలిపివేత 
మొన్నటి ఖరీఫ్‌లో రాష్ట్రంలో రైతులు 6 లక్షల 47 వేల 187 హెక్టార్లలో వేరుశనగను సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో 6 లక్షల 56 వేల 873 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. గత అక్టోబర్, నవంబరు నెలల్లో ధర పెద్దగా లేకపోయినా సాగుకు చేసిన అప్పులు తీర్చేందుకు క్వింటాకు రూ.3,800లకు అమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు క్వింటాకు రూ.4,450 మద్దతు ధర ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి 24 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఫిబ్రవరి 28 లోపు 11.70 లక్షల క్వింటాళ్లు  కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో  24 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది.

ఆయిల్‌ఫెడ్‌ అధికారులు అనంతపురం జిల్లాలో 1.60 లక్షల క్వింటాళ్లు, కర్నూలు 1.17 లక్షల క్వింటాళ్లు, వైఎస్సార్‌ జిల్లాలో 30 వేల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 3.07 లక్షల క్వింటాళ్లలో 1.25 క్వింటాళ్లను ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేయగా, మిగిలిన పంట అంతా అక్కడి మార్కెట్‌ యార్డుల్లోనే ఆరుబయట నిల్వచేశారు. దీనినంతటినీ ప్రభుత్వ గోదాములకు తరలించిన తరువాతనే కొత్తగా కొనుగోళ్లు ప్రారంభించాలని, అప్పటివరకు కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటినుంచి వేరుశనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేసి రైతులను దోపిడీ చేయడం ప్రారంభించారు. మూసివేసిన కొనుగోలు కేంద్రాలు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన పంటకు నగదు చెల్లింపులు జరగలేదని, మళ్లీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా అప్పుడు కొనుగోలు చేసిన పంటకు మరో రెండు నెలల వరకు నగదు చెల్లింపులు జరగవని రైతులకు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడంతో రైతులు మరో మార్గం లేక క్వింటా రూ.3,400లకు అమ్ముకుంటున్నారు. 

15 రోజులుగా పడిగాపులు: రామిరెడ్డి, నాగిరెడ్డి. కాటికానికాలువ, అనంతపురం రూరల్‌
ఈసారి కొంత వాతావరణం కరుణించడంతో అంతో ఇంతో వేరుశనగ పంట చేతికొచ్చింది. ఎకరాకు రూ.16 నుంచి రూ.18 వేల వరకు ఖర్చు చేశాం. వచ్చిన పంట అమ్ముకుందామంటే బయట వ్యాపారులు క్వింటా రూ.3,400కు మించి అడగడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. మేము వచ్చి 15 రోజులైంది. కూడు, నీళ్లు, నిద్ర లేక పదిహేను రోజులుగా రేయిబవళ్లు కాపలా కాస్తున్నాం. రైతులను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. 

గోదాముల కొరత పరిష్కారానికి చర్యలు: కె.రమేష్‌కుమార్‌ రెడ్డి, ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజర్‌
వేరుశనగ సేకరణకు గోదాముల కొరత ప్రధాన సమస్యగా ఉంది. కేంద్ర ప్రభుత్వం స్టేట్, సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ గోడౌన్లను లీజుకు తీసుకోవాలని ఆదేశించింది. అయితే అవి ఖాళీగా లేకపోవడంతో అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేసిన వేరుశనగను నెల్లూరు, గుంటూరు, తాడేపల్లిగూడెంల్లోని ప్రభుత్వ గోడౌన్లకు తరలిస్తున్నాం. రాయలసీమలో ప్రభుత్వ గోడౌన్లకు ధీటుగా ఉన్న వాటి వివరాలను కేంద్రానికి పంపాము. వాటిని లీజుకు తీసుకోడానికి అనుమతి వస్తే వచ్చే నెలలోపు లక్ష్యాన్ని సాధిస్తాం. రైతులకు వెంటనే నగదు చెల్లింపులు చేయడానికి రాష్ట్రంతో పాటు కేంద్రానికి లేఖ రాశాం. నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.

ఎకరాకు రూ.తొమ్మిది వేల నష్టం
ధాన్యానికి మద్దతు ధర లేకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా చేతికందడంలేదు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 1450లు కూడా ధర దక్కడంలేదు. కూలీల ఖర్చుతో సహా ఒక ఎకరా వరి సాగుకు రూ. 45 వేలు ఖర్చు అవుతోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ప్రస్తుతం లభిస్తున్న ధరను పోల్చితే ఎకరాకు రూ.తొమ్మిది వేల వరకు నష్టం వస్తోంది. 
–మాదు శ్రీనివాసరావు, మంతెన గ్రామం, కృష్ణా జిల్లా

కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం
కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నేను మూడు ఎకరాలు కౌలుకు తీసుకొన్నాను. ఎకరాకు 30 బస్తాలు కూడా దిగుబడి రాలేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడిపోగా ఇంకా రూ. 5 వేలు అప్పు మిగిలింది. జీఎస్టీ వల్ల పురుగు మందులు, ఎరువుల ధరలు పెరిగిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది.
–కవురు కోటేశ్వరరావు, ఎన్‌.ఆర్‌.పి.అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా.

Read latest Amaravati News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా