ఫలించిన ఎమ్మెలే విశ్వ పోరాటం

24 Jan, 2018 08:22 IST|Sakshi

ఇంటిపట్టాల పంపిణీకి మోక్షం

కోర్టు ఉత్తర్వులతో దిగొచ్చిన ప్రభుత్వం

ఉరవకొండ: పట్టణంలోని అర్హులైన పేదలకు జానెడు జాగా ఇప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి  దశలవారిగా  ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం చేయడానికి మూడు నెలల క్రితం  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిల్‌  దాఖలు చేయాలని కూడా సూచించింది.

కోర్టు ఆదేశాలతో స్పందించి ఆర్డీఓ, ఇతర అధికారులు పేదల ఇంటిపట్టాల ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. 2008లో మహనేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయంలో ఉరవకొండ పట్టణంలోని నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి 88 ఎకరాల స్థలాన్ని రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత పేదలకు పట్టాలు పంచి పెట్టడంలో టీడీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అటు ప్రభుత్వంపై ఇటు ఉన్నతాధికారుల పై ఒత్తిడి తీసుకురావడంతో ఇంటిపట్టాల పంపిణీ ప్రక్రియకు ఇప్పటికి మోక్షం కల్గింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరాటాల వల్లే తమకు ఇళ్ల పట్టాలకు మార్గం సుగమం అయిందని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు