నేటి నుంచి ‘రాజన్న బడిబాట’ 

12 Jun, 2019 09:15 IST|Sakshi

పండుగలా నిర్వహించాలన్న విద్యాశాఖమంత్రి సురేష్‌

సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్‌: వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈనెల 15 వరకు జరిగే రాజన్న బడిబాట కార్యక్రమాలను విజయంతం చేయాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. తొలిరోజు పాఠశాలలను అందంగా అలంకరించి పండుగ వాతావరణం కల్పించేలా చూడాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమానికి అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఘనంగా నిర్వహించాలన్నారు. బడిబాట ముగిసే సమయానికి విద్యార్థులకు యూనీఫాం, పాఠ్యపుస్తకాలు, షూ అందజేయాలన్నారు. గత ప్రభుత్వంలో లాగా సెలవు దినాల్లో సమీక్షల పేరుతో అధికారులను ఇబ్బందులకు గురి చేయమన్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించమని స్పష్టం చేశారు. జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈఓ దేవరాజు, ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి, ఏడీలు, ఈఈ, డీఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.  
రాజన్న బడిబాట షెడ్యూలు ఇలా... 


నేడు  ‘స్వాగత సంబరం’ 
పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని కల్పించాలి. పాఠశాలల్లో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించాలి. వారితో బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులు తయారు చేయించి ప్రదర్శించేలా చూడాలి.  
13న ‘నందనాభినయం’ 
విద్యార్థులతో మొక్కలు నాటించాలి. వాటిని దత్తత తీసుకునేలా చూడాలి. అభినయ  గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలి. 
14న ‘అక్షరం’ 
ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టాలి. 
15న ‘వందనం–అభివందనం’ 
ప్రముఖులతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇప్పించాలి. బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలి. తల్లిదండ్రుల సమావేశ నిర్వహణ, ప్రతిభ ఉన్న విద్యార్థులకు సత్కారం చేయాలి. వారితో సహపంక్తి భోజనాలు చేయాలి. 

మరిన్ని వార్తలు