నేటి నుంచి 11 వేల మందికి ఆన్‌లైన్ దర్శనం

11 Sep, 2014 01:30 IST|Sakshi
నేటి నుంచి 11 వేల మందికి ఆన్‌లైన్ దర్శనం
  • కరెంట్ బుకింగ్ టికెట్లు రెండు గంటలకు కుదింపు
  •  టూరిజం సంస్థలకూ ఆన్‌లైన్‌లోనే కోటా కింద టికెట్లు
  •  పోస్టాఫీసుల్లోనూ టికెట్ల విక్రయంపై జేఈవో సమావేశం  
  • సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములు కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటర్నెట్, ఈ-ద ర్శన్ రూ.300 టికెట్ల పద్ధతిలో గురువారం నుంచి 11వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. గతనెల 21న ఏడు రోజుల తర్వాత దర్శనం కోసం 5వేలు టికెట్లు ఇచ్చారు. ఒకరోజు తర్వాత దర్శనం కోసం వెయ్యి, 14 రోజుల మరో 5వేల టికెట్లను గతనెల 27 నుంచి అమలు చేశారు. ఇందులో ఒకరోజు, 7 రోజుల తర్వాత భక్తులు సజావుగా స్వామిని దర్శించుకుంటున్నారు.

    14 రోజుల తర్వాత టికెట్లు పొందిన భక్తులు గురువారం నుంచి దర్శనానికి రానున్నారు. మొత్తం 11 వేల టికెట్లలో అమ్ముడైన సుమారు 10వేల లోపే భక్తులు హాజరుకావచ్చని అధికారులు అంచనా వేశారు. వీరిని ఉదయం 10.30 గంటల నుంచే శ్రీవారికి దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా తిరుమలలోని కరెంట్ బుకింగ్‌ను ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టి తొమ్మిది గంటలకే నిలిపివేయనున్నారు. దీనిపై తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తిరుపతి పరిపాలన భవనంలో ఆయా విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. పోస్టాఫీసులో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

    గురువారం నుంచి మొత్తం 11 వేల టికెట్లు దర్శనాన్ని పరిశీలించిన తర్వాతే లోటుపాట్లు గుర్తించి, మరో 7వేల టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చారు. అంతవరకు తిరుమలలో అందుబాటులో ఉన్న సమయంలో కరెంట్ బుకింగ్‌లోనూ రూ.300 టికెట్లు ఇస్తారు. జిల్లా కేంద్రాల్లోని పోస్టాపీసుల ద్వారా కూడా రూ.300 టికెట్లు ఇచ్చే విషయంపై తిరుమల జేఈవో తిరుపతి పరిపాలన భవనంలో పోస్టల్ శాఖకు సంబంధించిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
     
    ఆన్‌లైన్‌లోనే  టూరిజం సంస్థలకు టికెట్లు

    శ్రీవారి దర్శన ప్యాకేజీలు నిర్వహించి ప్రభుత్వ టూరిజం సంస్థలకు ప్రస్తుతం రూ.300 టికెట్లను  ఆన్‌లైన్ ఇంటర్నెట్ పద్ధతిలో టికెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఇకపై వైకుంఠం క్యూకాంప్లెక్స్ ప్రధాన ద్వారం నుంచి కాకుండా టీబీసీ 129 కాటేజీ నుంచి ఆన్‌లైన్ టికెట్ల భక్తులతో కలపి పంపాలని  నిర్ణయించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజంకు  900 టికెట్లు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ)కు 150 టికెట్లు, తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్  కార్పొరేషన్ (టీటీడీసీ)కి 100 టికెట్లు, కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేఎస్‌టీడీసీ)కు మరో 100 టికెట్లు అందజేస్తున్నారు. వీటిలో ఏపీ టూరిజం నుంచి వేరుపడిన తెలంగాణ  టూరిజం సంస్థకు కూడా టికెట్లు ఇవ్వాలని సూచనప్రాయంగా సమ్మతించారు. అయితే త్వరలోనే అధికారికంగా  నిర్ణయం తీసుకోనున్నారు.
     

మరిన్ని వార్తలు