‘మొక్క’వోని సంకల్పం

13 Aug, 2019 10:16 IST|Sakshi

జిల్లాలో వనమహోత్సవానికి శ్రీకారం

ఒక్కో రైతు 10 మొక్కలు నాటేలా చర్యలు

రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కల నాటేందుకు సర్కార్‌ సిద్ధం

సాక్షి, ఒంగోలు: ప్రభుత్వం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ప్రతి రైతు కనీసం 10 మొక్కలు నాటేలా చర్యలు చేపట్టబోతోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్‌డీఏ–వెలుగు) ద్వారా నడుపుతున్న రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా ఈ మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో డీఆర్‌డీఏ–వెలుగు ద్వారా  2,813 రైతు ఉత్పత్తి సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 32,117 మంది రైతులు సభ్యులుగా చేరారు. ఈ రైతు ఉత్పత్తి సంఘాలు దోర్నాల, దొనకొండ, టంగుటూరు, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, బల్లికురవ, గుడ్లూరు, వెలిగండ్ల, కనిగిరి, వలేటివారిపాలెం, నాగులుప్పలపాడు, కొనకనమిట్ల, దొనకొండ, కనిగిరి, మద్దిపాడు, హనుమంతునిపాడు, జరుగుమల్లి మండలాల్లో ఉన్నాయి. వీరికి ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజర్స్‌ (ఎఫ్‌పీవో) ద్వారా రైతులకు అనేక సేవలు అందిస్తున్నారు.

దీంతో ప్రతి రైతు కనీసం 10 మొక్కలను తమ ఆధీనంలో అంటే పొలాల గట్లపై గానీ ఇంటి వద్ద గానీ నాటేలా చేయాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 3 లక్షల మొక్కలను రైతుల ద్వారా నాటించాలన్నదే లక్ష్యం. రైతులకు సరఫరా చేసే మొక్కలను జిల్లాలో ఉన్న ఫారెస్ట్‌ నర్సరీల నుంచి సరఫరా చేయనున్నారు. ఈ రైతు ఉత్పత్తి సంఘాలు ఉన్న ప్రాంతాలకు నర్సరీల నుంచి మొక్కలను సరఫరా చేస్తారని, అక్కడ నుంచి రైతులకు ఇస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వనం–మనం, ప్రకృతి పిలుస్తోంది అనే పేరుతో క్యాంపెయిన్‌  చేపట్టబోతుంది. రైతులే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయక సంఘ మహిళా సభ్యులకు కూడా మొక్కలను సరఫరా చేస్తారు.

ఈ కార్యక్రమం అమలుపై రైతు ఉత్పత్తి సంఘాలు మంగళవారం సమావేశం కానున్నాయి. అదే విధంగా డీఆర్‌డీఏ–వెలుగు, అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం   ప్రకాశం భవనంలోని సీపీవో కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించాలని సర్కార్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతే కాకుండా  ప్రతి సిటిజనర్‌ ఒక మొక్క నాటేలా  ప్రోత్సహించాలని సూచించింది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో వనం–మనం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

మరిన్ని వార్తలు