అనుమానం.. పెనుభూతమై

19 Nov, 2017 11:10 IST|Sakshi

భార్యపై అనుమానంతో ఒక వ్యక్తి మూడేళ్ల పసి బాలుడి ఉసురు తీశాడు. తన భార్యతో బాలుడి తండ్రికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో వీరాంజనేయులు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.  నాయనమ్మ ఒడిలో ఉన్న బాలుడు మణికంఠ(3)ని బలవంతంగా తీసుకెళ్లి బావిలో పడేసి ఉసురు తీశాడు. ఈ హృదయ విదారక ఘటన మార్టూరు మండలం ద్వారకపాడులో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  

మార్టూరు: మండలంలోని ద్వారకపాడులో దారుణం జరిగింది. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వైషమ్యాలకు అభం శుభం తెలియని మూడేళ్ల పసిమొగ్గ బలైంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోరంట్ల కోటయ్య, సుబ్బాయమ్మ దంపతుల కుమారుడు మణికంఠ (3). అదే గ్రామానికి చెందిన ఆనంగి వీరాంజనేయులు, వెంకటేశ్వరమ్మ భార్యాభర్తలు. ఈ రెండు కుటుంబాల మధ్య కొంత బంధుత్వం కూడా ఉంది. తన భార్య వెంకటేశ్వరమ్మకు కోటయ్యతో వివాహేతర సంబంధం ఉందని వీరాంజనేయులకు కొన్ని నెలలుగా అనుమానం ఉంది. రోజులు గడిచేకొద్దీ అనుమానం పెనుభూతంగా మారింది. వీరాంజనేయులు విచక్షణ కోల్పోయాడు. ద్వారకపాడు సమీపంలోని కొండ వద్ద గొర్రెలు మేపుకుంటున్న కోటయ్యను హతమారుస్తానంటూ శుక్రవారం సాయంత్రం వీరాంజనేయులు కత్తి తీసుకుని వెళ్లాడు. దూరం నుంచే వీరాంజనేయులను గమనించిన కోటయ్య సమీపంలోని రాళ్ల మధ్య నక్కాడు. ఎలాగైనా కోటయ్యను చంపుతానంటూ అక్కడ ఉన్న మిగిలిన గొర్రెల కాపరులతో హెచ్చరించి గ్రమంలోకి వచ్చాడు.  

పాపం పసివాడు..
వీరాంజనేయులు సరాసరి కోటయ్య ఇంటికి వెళ్లాడు. కోటయ్య తల్లి కోటమ్మ ఒడిలో ఉన్న మణికంఠను విసురుగా లాక్కుని కోటమ్మ మెడపై కత్తి ఉంచి చంపేస్తానంటూ బెదిరించాడు. మణికంఠను తీసుకుని అద్దంకి –నార్కట్‌పల్లి రహదారి వెంట సంతమాగులూరు అడ్డరోడ్డు దాటుకుని గుంటూరు జిల్లా నకరికల్లు చేరుకున్నాడు. నకరికల్లు గ్రామం బయట సాగర్‌ కాలువ నుంచి చెరువుకు నీరు సరఫరా చేసే కాలువ మార్గంలో ఉన్న బావిలో మణికంఠను విసిరేసి కసి తీర్చుకున్నాడు. మణికంఠ నాయనమ్మ కోటమ్మ ద్వారా సమాచారం తెలుసుకున్న బంధువులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వీరాంజనేయులు కోసం గాలించినా ఆచూకీ తెలియలేదు. 

అర్ధరాత్రి గ్రామానికి వచ్చిన నిందితుడు
అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పూటుగా మద్యం తాగి కోటయ్య కోసం వెతుక్కుంటూ గ్రామంలోకి వచ్చిన వీరాంజనేయులును స్థానికులు బంధించి అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు తన సిబ్బందితో ద్వారకపాడు వెళ్లి వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించగా బావిలో పడేసి మణికంఠను చంపినట్లు నేరం అంగీకరించాడు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం నకరికల్లు చేరిన పోలీసులు మణికంఠ మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీయించి పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ద్వారకపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

నిందితుడి అరెస్టు
బాలుడు మణికంఠ హత్య కేసులో నిందితుడు ఆనంగి వీరాంజనేయులును చీరాల డీఎస్పీ డాక్టర్‌ ప్రేమ్‌కాజల్‌ శనివారం రాత్రి అరెస్టు చూపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలు వెల్లడించారు. చీరాల ఒన్‌టౌన్‌ సీఐ సూర్యనారాయణ మార్టూరు పోలీసులతో కలిసి వీరాంజనేయులును అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సంఘటన జరిగిన 24 గంటల్లోపే కేసు ఛేదించిన ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, ఆయన సిబ్బందికి రివార్డులు ఇవ్వాలంటూ ఎస్పీ సత్య ఏసుబాబుకు సిఫార్సు చేయనున్నట్లు డీఎస్పీ డాక్టర్‌ ప్రేమ్‌కాజల్‌ వివరించారు.   

మరిన్ని వార్తలు