వెలగపూడికి 30 శాఖలు

4 Oct, 2016 09:15 IST|Sakshi
వెలగపూడికి 30 శాఖలు

- స్వాగతం పలికిన రెవెన్యూ అసోసియేషన్ నేతలు, విద్యార్థులు
- వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, ఉన్నత విద్యా శాఖలు హైదరాబాద్‌లోనే
 
 సాక్షి, అమరావతి:
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి సోమవారం 30 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తరలివచ్చారు. ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు తమ కార్యాలయాలను పరిశీలించారు. కొన్ని చోట్ల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్ల బిగింపు ఇంకా పూర్తి కాలేదు. దీంతో చాలా మంది ఉద్యోగులు  అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, సచివాలయ ఉద్యోగులకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేశవనాయుడు, వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భక్తవత్సలనాయుడు, సత్యనారాయణ, విజయవాడ సిటీ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.

ఉద్యోగులకు వారు మిఠాయిలు పంచారు. ఉద్యోగులకు దారి మధ్యలో ఉండే పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని స్వాగతం చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సచివాలయానికి వచ్చారు. యనమల రామకృష్ణుడు తమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎంతమంది వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తం సచివాలయ ఉద్యోగులు సుమారు 1,500 మంది వరకు సోమవారం సచివాలయానికి వచ్చారు. ఉద్యోగులకు సీఆర్‌డీఏ భోజన ఏర్పాట్లు చేసింది. కొన్ని శాఖల వారు తామే నేరుగా భోజనం తెప్పించుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఈ ఏర్పాట్లు పరిశీలించారు. కాగా, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, ఉన్నత విద్యా శాఖలు ఇంకా హైదరాబాద్ నుంచి రాలేదు.

మరిన్ని వార్తలు