సర్కారీ ఇంటికి సరికొత్త కొర్రీ

20 Apr, 2016 00:28 IST|Sakshi

    స్థలం ఉన్నవారికే అవకాశం
     50 శాతం మందికి దక్కని ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం
     మెరక పనులకు నోచుకోని ఇందిరమ్మ స్థలాలు
     పత్తాలేని ఎన్‌టీఆర్ గృహనవీకరణ పథకం

 
 మండపేట : స్థలం లేని పేదల సొంతింటి కల ఇప్పట్లో సాకారమయ్యే అవకాశం కనిపించడం లేదు. పేదల గృహనిర్మాణానికి ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపినా కొందరికే ప్రయోజనం చేకూరనుంది. సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే రుణం మంజూరు కానుంది. మరోపక్క ఎన్‌టీఆర్ గృహనవీకరణ పథకం లబ్ధిదారుల ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోగా ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విడుదల ఊసెత్తడం లేదు. పట్టణ ప్రాంతాలకు నిర్ధేశించిన అమృత పథకం అధికార పార్టీ నేతల పైరవీలతో పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు  టీడీపీ ప్రభుత్వం గృహనిర్మాణ రుణాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం పేరిట నియోజకవర్గానికి 1,250 చొప్పున, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్‌కు 500 చొప్పున మొత్తం జిల్లాకు 19,750 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.2.9 లక్షలు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణం కోసం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ భూమిపూజలు నిర్వహించారు.
 
  ఇంతవరకు బాగానే ఉన్నా నిబంధనల మేరకు ఎంతమందికి లబ్ధి చేకూరుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది.  జిల్లాకు మంజూరైన ఇళ్లలో 50 శాతం సొంత స్థలాలు ఉన్న వారికి మంజూరు చేస్తారు. మిగిలిన 50 శాతం ఇళ్లను గత ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలాల్లో మంజూరుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే జిల్లా వ్యాప్తంగా గతంలో సేకరించిన వందలాది ఎకరాల ఇందిరమ్మ స్థలాల్లో చాలాచోట్ల ఇప్పటికి మెరక పనులు చేయలేదు.
 
 వీటిని మెరక చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి గృహ నిర్మాణ రుణాల మంజూరు చేయడం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలేవి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామాల్లో సొంత స్థలాలు లేని పేదవర్గాల వారి సొంతింటి కల ఇప్పట్లో సాకారం సాకారమయ్యే దాఖలాలు కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు 19,750 ఇళ్లు మంజూరుకు గాను ప్రస్తుత మార్గదర్శకాల మేరకు సుమారు సగం మందికి మాత్రమే లబ్ధి చేకూరతుతుందని పలువురు అంటున్నారు.
 
  కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతిలిచ్చిన సర్కారు పెండింగ్ బిల్లులను విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినకాడికి అప్పులు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని, బిల్లులు రాకపోవడంతో రుణగ్రస్తులుగా మారిపోయామని కొందరు వాపోతుండగా, బిల్లులు రాక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్ బిల్లులు సుమారు రూ.40 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉన్నట్టు అంచనా. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 
 మరోపక్క 1993 - 2004 మధ్య కాలంలో నిర్మించిన గ్రామాల్లోని పేదల ఇళ్లను ఎన్‌టీఆర్ గృహనవీకరణ పథకం కింద ఆధునీకరించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అర్బన్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మంజూరు చేసింది. ఒక్కో ఇంటి మరమ్మతుల నిమిత్తం రూ.10 వేలు చొప్పున రూ.17 కోట్లను కేటాయించింది. ఆ కాలంలో జిల్లాలో 2,01,780 ఇళ్లను నిర్మించగా ఎన్‌టీఆర్ గృహనవీకరణ పథకం కింద 17 వేల ఇళ్లను మాత్రమే ఎంపిక చేశారు. మార్చి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం.
 
 అధికారపార్టీ కనుసన్నల్లోనే అమృత
 అమృత పథకం కింద జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు మంజూరైన 24,332 ప్లాట్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ప్లాటు రూ. 5.5 లక్షలు చొప్పున జీఫ్లస్ 1 తరహాలో ఇళ్ల నిర్మాణం చేయనున్నారు. జిల్లాలోని తుని మున్సిపాల్టీకి 5,090 ప్లాట్లు మంజూరవ్వగా, కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ప్లాట్లు, రాజమండ్రికి 4,200, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురంనకు 1,088, మండపేటకు 4,064, పిఠాపురంనకు 874, అమలాపురంనకు 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. అర్హులతో నిమిత్తం లేకుండా పలు మున్సిపాల్టీల్లో అధికార పార్టీ నేతలు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేద వర్గాల వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు