అందరికీ ఇళ్లు.. అవినీతికి ఆనవాళ్లు

12 Oct, 2018 07:19 IST|Sakshi

ఒంగోలులోని పీఎంఏవై నిర్మాణాల్లో రూ.600 కోట్ల అవినీతి

లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలు ఉల్లంఘించారు

ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సామాజిక కార్యకర్త

ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలి

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం 

ప్రతివాదుల్లో అధికారులతోపాటు ఒంగోలు ఎమ్మెల్యే

విచారణ మూడు వారాలకు వాయిదా

ఒంగోలు: అందరికీ ఇళ్లు పేరుతో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఒంగోలులో నిర్మిస్తున్న మొదటి, మూడో విడత గృహ నిర్మాణాలకు సంబంధించి రూ.600కోట్ల అవినీతి చోటు చేసుకుందంటూ సామాజిక కార్యకర్త మలిశెట్టి శ్రీనివాసరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని తీర్మానిస్తూ హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో చదరపు అడుగు వ్యయం రూ.896.97గా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.1900గా నిర్ణయించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఫిర్యాది పేర్కొన్నారు. 

మొత్తం 53,51,170 చదరపు అడుగుల నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సంస్థ అయిన టిడ్కోకు అదనంగా రూ.535కోట్లు చెల్లింపులు జరుగుతాయని, అదే «విధంగా కొప్పోలు వద్ద మూడో విడతకు సేకరించిన భూమి ధర చెల్లింపులోను పెద్ద ఎత్తున అవినీతి వ్యవహారం నడిచిందని పేర్కొన్నారు. ఇందులో 50.50 ఎకరాలకుగాను రూ.35కోట్లు అదనంగా చెల్లిస్తున్నారని, తద్వారా రెండు దశలలో కలిపి రూ.600 కోట్ల అవినీతి ఉందన్నారు. నిబంధనల ప్రకారం సొంతిల్లు లేనివారికి, రూ.3లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు అర్హులుకాగా తమ పరిశీలనలో మొదటి విడతలోని 1488 మందిలో 134 మందికి సొంతి ళ్లు ఉన్నాయని తేలిందన్నారు. మరికొందరికి కుటుంబసభ్యుల పేర్లతో ఇళ్లు ఉన్నాయని, అసలు ఒంగోలులో రేషన్‌ కార్డులు లేనివారికి కూడా పథకంలో చోటు కల్పించినట్లు మలిశెట్టి శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పది మంది ప్రతివాదులు..
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు సిఫార్సుల మేరకు అధికారులు లబ్ధిదారులను గుర్తిస్తున్నారని మలిశెట్టి శ్రీనివాసరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నగరపాలక సంస్థ మొత్తం 14656 మందిని లబ్ధిదారులుగా పేర్కొంటే అందులో 1051 మంది అనర్హులుగా తమ ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందంటూ సంబంధిత పత్రాలను ధర్మాసనానికి సమర్పించారు. దీనిపై గురువారం హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు పి.రాధాకృష్ణ, వి.రామసుబ్రహ్మణ్యన్‌లు విచారణ జరిపారు. గతంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన పర్యవేక్షణాధికారిని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించడంతో అందుకు సమ్మతించి అఫిడవిట్‌ దాఖలు చేశారు.

 దీంతో గురువారం అందరికీ ఇళ్లు అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు దృష్టి సారించి మొత్తం 10 మందిని ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రతివాదులుగా పేర్కొన్న వారిలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు, ఏపీ టిడ్కో ఎండీ, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఒంగోలు ఆర్‌డీవో, తహసీల్దారు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన మిషన్‌ సంయుక్త కార్యదర్శి, మిషన్‌ డైరెక్టర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన తదుపరి విచారణను మూడు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు