కరోనా విశ్వరూపం 

2 Jul, 2020 11:04 IST|Sakshi

ఒక్కరోజు 94 కేసులు 

జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

800 దాటిన మొత్తం  కేసులు సంఖ్య 

కరోనాతో తాజాగా ఇద్దరి మృతి 

చికిత్స అనంతరం కోలుకున్న 27 మంది డిశ్చార్జి 

ఒంగోలు సెంట్రల్‌: కరోనా వైరస్‌ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రకాశం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే అత్యధికంగా 94 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 820కి చేరుకుంది. బుధవారం కరోనాతో ఇద్దరు మృతి చెందగా చికిత్స అనంతరం కోలుకున్న 27 మందిని ఆస్పత్రి  నుంచి డిశ్చార్జి  చేసినట్టు వైద్యాధికారులు వెల్లడించారు.  

సామాజిక వ్యాప్తి ఉధృతం.. 
జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. దీంతో పక్క, పక్కనే ఉండే వారిలో ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. బుధవారం నాటి కేసుల్లో ఒక్క ఒంగోలు నగరంలోనే 26 కేసులు నమోదు కాగా చీరాలలో 14, మార్కాపురంలో 11, కందుకూరులో 11, పామూరులో 8 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ముండ్లమూరులో 4, చినపవని 2, కొత్తపల్లి, మాచవరం,  మర్రిపూడి, సింగరాయకొండ, బల్లికురవ, పొదిలి, పర్చూరు, వేటపాలెం, కొండపల్లి, కొత్తపట్నం, చవటపాలెం, మొగిలిచర్ల, కొనకనమిట్ల, కారుమానిపల్లి, గార్లదిన్నె, కొండపల్లిలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. వీటిలో 25 వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో నిర్థారణ కాగా మిగిలినవి ట్రూనాట్‌ టెస్ట్‌లలో పాజిటివ్‌గా తేలాయి. పాజిటివ్‌ వచ్చిన వారినందరినీ చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా బుధవారం జిల్లాలో ఇరువరు కోవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో ఒంగోలు గాంధీనగర్‌కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి, మార్కాపురానికి 50 సంవత్సరాల మహిళ ఉన్నారు.   

మరిన్ని వార్తలు