ఖుషీఖుషీగా.. ఫైజర్‌- ఐడీబీఐ బ్యాంక్‌

2 Jul, 2020 11:15 IST|Sakshi

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై అంచనాలు

5% జంప్‌చేసిన ఫైజర్‌ లిమిటెడ్‌

13 క్వార్టర్ల తదుపరి నికర లాభాలు

52 వారాల గరిష్టానికి ఐడీబీఐ బ్యాంక్‌

సానుకూల విదేశీ సంకేతాలతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 329 పాయింట్లు జంప్‌చేసి 35,744ను తాకగా.. నిఫ్టీ  94 పాయింట్లు ఎగసి 10,524 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 చికిత్సకు వీలుగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ సత్ఫలితాలను ఇస్తున్నట్లు యూఎస్‌ మాతృ సంస్థ ఫైజర్‌ ఇంక్‌ ప్రకటించడంతో దేశీ అనుబంధ సంస్థకు డిమాండ్‌ పెరిగింది. వెరసి ఫైజర్‌ లిమిటెడ్‌ జోరందుకుంది. ఇక మరోపక్క ఐడీబీఐ బ్యాంక్‌ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఫైజర్‌ లిమిటెడ్‌
జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ కోవిడ్‌-19 రోగులపై నిర్వహించిన పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు ఫైజర్‌ ఇంక్‌ తాజాగా పేర్కొంది. దీంతో బుధవారం యూఎస్‌ మార్కెట్లో ఫైజర్‌ ఇంక్‌ షేరు 3 శాతం బలపడింది. ఈ బాటలో దేశీ అనుబంధ కంపెనీ ఫైజర్‌ లిమిటెడ్‌కూ డిమాండ్‌ పెరిగింది. మాతృ సంస్థ నుంచి వ్యాక్సిన్‌ వెలువడితే.. దేశీయంగానూ ఫైజర్‌ లిమిటెడ్‌ లబ్ది పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫైజర్‌ లిమిటెడ్‌ షేరు 5 శాతం జంప్‌చేసి 4,170 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం ఎగసి రూ. 4275 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

ఐడీబీఐ బ్యాంక్‌
గత నెల రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఐడీబీఐ బ్యాంక్‌ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. 48.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బ్యాంక్‌ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ) రూ. 50,000 కోట్లను తాకింది. తద్వారా పీఎన్‌బీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంకులను మార్కెట్‌ విలువలో ఐడీబీఐ బ్యాంక్‌ అధిగమించింది. జూన్‌ 1 నుంచీ ఐడీబీఐ బ్యాంక్‌ కౌంటర్‌ ఏకంగా 137 శాతం ర్యాలీ చేసింది. రూ. 20.3 స్థాయి నుంచి బలపడుతూ వస్తోంది. 13 త్రైమాసికాల తదుపరి గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో బ్యాంక్‌ నికర లాభాలు ఆర్జించడంతో ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ఇటీవల బీమా అనుబంధ విభాగం ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 27 శాతం వాటా విక్రయించేందుకు బ్యాంక్‌ బోర్డు అనుమతించడం ఇందుకు జత కలిసినట్లు తెలియజేశారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు